ICC Rankings: మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం

వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) ముంగిట భారత క్రికెటర్లలో జోష్ నింపేలా ఐసీసీ ర్యాంకుల పంట పడింది. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్‌లో జట్టుగా టీమ్‌ఇండియా అగ్రస్థానంలో ఉండగా.. ఆటగాళ్లూ టాప్‌ ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు.

Updated : 23 Sep 2023 14:11 IST

ఒకప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఓ భారత ఆటగాడు అగ్రస్థానానికి చేరుకుంటే గొప్పగా చెప్పుకొనేవాళ్లం. అలాగే మన జట్టు ఏదైనా ఫార్మాట్లో నంబర్ వన్ అయితే దాని గురించీ విశేషంగా మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు వివిధ ఫార్మాట్లో మన వాళ్లు నంబర్ వన్ కావడం మామూలైపోయింది. అలాగే వివిధ ఫార్మాట్లలో టీమ్‌ఇండియా తరచుగా అగ్ర స్థానం సాధిస్తోంది. మొత్తంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్‌దే తిరుగులేని ఆధిపత్యం అనడంలో సందేహం లేదు.

హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇటీవలే వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. అతను నంబర్ వన్ కావడం కొత్తేమీ కాదు. కొన్ని నెలల కిందటే అతనీ ఘనత సాధించాడు. అయితే మధ్యలో అగ్రస్థానం అతడి నుంచి చేజారింది. కానీ ఆసియా కప్‌లో అదరగొట్టడంతో నంబర్ వన్ కిరీటం తిరిగి అతడి ఒళ్లో వాలింది. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన ఆసియాకప్‌ ఫైనల్లో అతను ఎలా చెలరేగిపోయాడో తెలిసిందే. నిప్పులు చెరిగే బంతులతో ఏకంగా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు.. మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడతను. ఈ ఫైనల్ అయ్యాక ప్రకటించిన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ అగ్రస్థానం సంపాదించాడు. 678 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్‌ను వెనక్కి నెట్టి సిరాజ్ వన్డే నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో పాల్గొననున్నాడు సిరాజ్. ఆ తర్వాత ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కూడా భారత్‌లోనే జరగబోతోంది. అలవాటైన పిచ్‌లపై సిరాజ్ ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశముంది కాబట్టి అతను అగ్రస్థానాన్ని పదిలపరుచుకునే అవకాశముంది. ప్రస్తుతం భారత క్రికెటర్లలో ప్రపంచ నంబర్ వన్ ఆటగాళ్లు మరో ముగ్గురు ఉండటం విశేషం. 

టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ చాన్నాళ్లుగా అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో 889 పాయింట్లుండగా.. రెండో స్థానంలో ఉన్న రిజ్వాన్ (811) ఇప్పట్లో అతణ్ని అందుకోవడం కష్టమే. 2021లోనే టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సూర్య.. ఏడాది తిరిగేసరికే అగ్రస్థానం సాధించడం విశేషం. ఇక టెస్టుల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు అగ్రస్థానంలో ఉన్నారు. బౌలర్లలో సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్ 879 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రబాడ (825) రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా 455 పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో అగ్రస్థానం సాధించిన అశ్విన్.. ఆల్‌రౌండర్లలో 370 పాయింట్లతో రెండో స్థానంలో ఉండటం విశేషం. కాబట్టి ఇప్పట్లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్ స్థానం వేరే వాళ్లకు వెళ్లేలా లేదు.

శుభ్‌మన్ రయ్యి రయ్యిమంటూ..

సూర్యకుమార్, సిరాజ్‌ల మాదిరే.. వేగంగా అగ్రస్థానం వైపు దూసుకెళ్తున్నాడు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్. అతను వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో 814 పాయింటున్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 857 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. శుభ్‌మన్ ఫామ్ చూస్తుంటే అతను సమీప భవిష్యత్తులోనే నంబర్ వన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ ఏడాది వన్డేల్లో అతను ఒక డబుల్ సెంచరీ, మూడు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలతో వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. ఇదే ఫామ్‌ను ఆస్ట్రేలియా సిరీస్, ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే.. అదే సమయంలో బాబర్ కొంచెం డౌన్ అయితే అగ్రస్థానం శుభ్‌మన్ సొంత కావడం ఖాయం. అప్పుడు వివిధ ఫార్మాట్లలో ఐదుగురు నంబర్ వన్ ఆటగాళ్లుంటారు మన జట్టులో.

టీమ్‌ ఇండియా కూడా..

ఒకేసమయంలో మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకొని అరుదైన ఘనతను సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఫీట్‌ను సాధించింది. పాక్‌ను వెనక్కి నెట్టి 116 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఇటీవలే భారత్‌ ఈ ఘనత సాధించాల్సినప్పటికీ కాస్త ఆలస్యం అయింది. ఆసియా కప్‌లో నిలకడగా రాణించిన భారత్‌.. అగ్రస్థానానికి చేరువగా వచ్చింది. ఈ టోర్నీని ఓటమి లేకుండా ముగించి ఉంటే భారత్ నంబర్ వన్ అయ్యేది. కానీ సూపర్-4 దశలో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. తనకంటే ర్యాంకింగ్స్‌లో బాగా తక్కువ స్థాయిలో ఉన్న బంగ్లాదేశ్‌ చేతిలో ఓడటంతో భారత్‌కు పాయింట్లలో కోత పడింది. దీంతో అగ్రస్థానం త్రుటిలో చేజారింది. తర్వాత ఆసియా కప్‌ను సాధించినా ఫలితం లేకపోయింది. అయితే తొలి వన్డేలో కంగారూలను ఓడించిన టీమ్‌ఇండియా తన క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2012లో దక్షిణాఫ్రికా ఈ ఘనత సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత్‌ రెండో జట్టుగా నిలిచింది.  

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని