ఇది ఆరంభం మాత్రమే: షెఫాలి

అండర్‌-19 ప్రపంచకప్‌ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, దక్షిణాఫ్రికా నుంచి మరో కప్పుతో స్వదేశం రావాలనుందని టీమ్‌ఇండియా బ్యాటర్‌ షెఫాలి వర్మ ఆశాభావం వ్యక్తం చేసింది.

Published : 31 Jan 2023 02:52 IST

పోచెఫ్‌స్ట్రూమ్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, దక్షిణాఫ్రికా నుంచి మరో కప్పుతో స్వదేశం రావాలనుందని టీమ్‌ఇండియా బ్యాటర్‌ షెఫాలి వర్మ ఆశాభావం వ్యక్తం చేసింది. మొట్టమొదటి అమ్మాయిల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో షెఫాలీ సారథ్యంలోని యువ భారత్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్‌ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన షెఫాలి.. వచ్చే నెల 10న సఫారీ గడ్డపైనే ఆరంభమయ్యే మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆడనుంది. ‘‘ఈ అండర్‌-19 ప్రపంచకప్‌ ఒక్కటే కాదు. సీనియర్‌ మహిళల టీ20 ప్రపంచకప్‌నూ సాధించి భారత్‌కు రావాలి. గెలవాలనే లక్ష్యంతోనే అండర్‌-19 ప్రపంచకప్‌పై ధ్యాస పెట్టా. అది సొంతమైంది. ఈ ఆత్మవిశ్వాసంతో సీనియర్‌ ప్రపంచకప్‌ గెలవాలనుకుంటున్నా. ఇక అండర్‌-19 మెగా టోర్నీ గురించి మర్చిపోయి, సీనియర్‌ జట్టుతో కలిసిపోయి టీ20 ప్రపంచకప్‌ నెగ్గడానికి ప్రయత్నిస్తా’’ అని ఆమె తెలిపింది. 2020 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో (మెల్‌బోర్న్‌) ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత జట్టులోనూ షెఫాలి ఉంది. ఆ పరాజయం తాలూకు బాధ ఇంకా అనుభవిస్తున్నానని ఆమె చెప్పింది. ‘‘మెల్‌బోర్న్‌లో ఆ ఫైనల్‌  నాకెంతో భావోద్వేగాన్ని కలిగించింది. ఆ మ్యాచ్‌ గెలవలేకపోయాం. ఇప్పుడు అండర్‌-19 జట్టుతో కలిశాక కప్పు నెగ్గాలని బలంగా అనుకున్నాం. మనం కప్పు కోసమే ఇక్కడికి వచ్చామని అమ్మాయిలకు చెప్పా. 2020లో ప్రపంచకప్‌ చేజారినప్పుడు ఏడ్చాం. ఇప్పుడూ కన్నీళ్లు పెట్టుకున్నాం. కానీ ఇవి ఆనంద భాష్పాలు. ఇది నాకో పెద్ద ఘనత. ఈ ఒక్క కప్పుతోనే సంతృప్తి చెందను. ఇది ఆరంభం మాత్రమే’’ అని షెఫాలీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని