IND vs NZ: గిల్‌ దంచేయగా.. పేసర్లు కూల్చేయగా..

7, 11.. వన్డేల్లో పరుగుల వరద పారించిన తర్వాత న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20ల్లో వరుసగా శుభ్‌మన్‌ స్కోర్లు. అతని ఆటతీరు వన్డేలకే నప్పుతుందని.. పొట్టి ఫార్మాట్‌కు అతను సరిపోడన్న వ్యాఖ్యలు.

Updated : 02 Feb 2023 06:47 IST

కివీస్‌పై టీమ్‌ఇండియా భారీ విజయం
సిరీస్‌ 2-1తో వశం
శుభ్‌మన్‌ సెంచరీ
బంతితో అదరగొట్టిన హార్దిక్‌

7, 11.. వన్డేల్లో పరుగుల వరద పారించిన తర్వాత న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20ల్లో వరుసగా శుభ్‌మన్‌ స్కోర్లు. అతని ఆటతీరు వన్డేలకే నప్పుతుందని.. పొట్టి ఫార్మాట్‌కు అతను సరిపోడన్న వ్యాఖ్యలు. కానీ ఆ మాటలు తప్పని నిరూపిస్తూ.. బ్యాటింగ్‌కు సొగసును, విధ్వంసానికి కళాత్మకతను జోడిస్తూ అజేయ సెంచరీతో చెలరేగాడు శుభ్‌మన్‌. ఆకట్టుకునే కవర్‌డ్రైవ్‌లు.. వారెవా అనిపించే లాఫ్టెడ్‌ షాట్లు.. అదరగొట్టే ఫ్లిక్‌, కట్‌ షాట్లు.. ఇలా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ20ల్లో తొలి అర్ధసెంచరీనే మొదటి శతకంగా మార్చాడు. బౌలింగ్‌లో వికెట్ల కరవును తీర్చుకుంటూ హార్దిక్‌.. తిరిగి లయ అందుకుంటూ అర్ష్‌దీప్‌.. జోరు కొనసాగిస్తూ శివమ్‌ మావి, ఉమ్రాన్‌.. ఛేదనలో కివీస్‌కు ఊపిరాడనివ్వలేదు. ఫీల్డింగ్‌లో సూర్య చేతులు అద్భుతమే చేశాయి. ఫలితమే.. మూడో టీ20లో టీమ్‌ఇండియా భారీ విజయం. ఖాతాలో మరో సిరీస్‌.

అహ్మదాబాద్‌

సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం మూడో టీ20లో న్యూజిలాండ్‌పై 168 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగుల భారీస్కోరు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుభ్‌మన్‌ గిల్‌ (126 నాటౌట్‌; 63 బంతుల్లో 12×4, 7×6) పొట్టి ఫార్మాట్లోనూ తనదైన ముద్ర వేస్తూ.. తొలి టీ20 శతకం బాదేశాడు. రాహుల్‌ త్రిపాఠి (44; 22 బంతుల్లో 4×4, 3×6) కూడా రాణించాడు. ఛేదనలో కివీస్‌ను భారత బౌలర్లు భయపెట్టారు. పేసర్ల ధాటికి ఆ జట్టు 12.1 ఓవర్లలో 66కే కుప్పకూలింది. డరైల్‌ మిచెల్‌ (35), శాంట్నర్‌ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (4/16), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/16), ఉమ్రాన్‌ మాలిక్‌ (2/9), శివమ్‌ మావి (2/12) సత్తాచాటారు. హార్దిక్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.

మూడు ఓవర్లకే..: కొండంత లక్ష్యం ఎదురుగా ఉన్నా.. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడం, జట్టులో నాణ్యమైన బ్యాటర్లు ఉండడంతో కివీస్‌ దీటుగా పోరాడుతుందనే అనుకున్నారంతా. కానీ మూడు ఓవర్లకే ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది. ఏ పిచ్‌పై అయితే ప్రత్యర్థి బౌలర్లు చేతులెత్తేశారో.. అదే చోట భారత పేసర్లు హడలెత్తించారు. బ్యాటింగ్‌లో హార్దిక్‌, సూర్య జతగా చెలరేగడం మామూలే కానీ.. ఈ మ్యాచ్‌లో వీళ్లిద్దరు కలిసి రెండు కీలక వికెట్లు పడగొట్టారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో అలెన్‌ (3)ను, మూడో ఓవర్లో ఫిలిప్స్‌ (2)ను పెవిలియన్‌ చేర్చారు. హార్దిక్‌ అధిక బౌన్స్‌ రాబట్టగా.. స్లిప్‌లో వీళ్ల క్యాచ్‌లను కళ్లు చెదిరే రీతిలో సూర్య గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. మధ్యలో రెండో ఓవర్లో అర్ష్‌దీప్‌ వైవిధ్యమైన బంతులతో కాన్వే (1), చాప్‌మన్‌ (0) కథ ముగించాడు. దీంతో మూడు ఓవర్లయినా పూర్తికాకముందే 7/4తో ఓటమి దిశగా సాగింది కివీస్‌. బౌలింగ్‌కు వచ్చిన ఉమ్రాన్‌.. ప్రమాదకర బ్రాస్‌వెల్‌ (8)ను బౌల్డ్‌ చేయడంతో ఆ జట్టు 21/5తో నిలిచింది. ఇక ఆ తర్వాత బ్యాటర్ల పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే ఉపయోగపడింది. మావి తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్‌ 9వ)నే రెండు వికెట్లతో భారత విజయాన్ని వేగవంతం చేశాడు. మొదట కెప్టెన్‌ శాంట్నర్‌ (13) క్యాచ్‌ను డీప్‌ మిడ్‌వికెట్‌ బౌండరీ లైన్‌ దగ్గర అందుకున్న సూర్య.. ఒంటికాలితో తనను తాను గొప్పగా నియంత్రించుకున్నాడు. అనంతరం త్రిపాఠి పట్టిన క్యాచ్‌కు సోధి (0) నిష్క్రమించాడు. ఆ తర్వాత నాలుగు ఓవర్లలోపే  ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది.

పొట్టి ఫార్మాట్లోనూ అతనే..: అంతకుముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ బ్యాటింగే హైలైట్‌. గత రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అతను.. ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. గిల్‌కు జీవనదానాలూ కలిసొచ్చాయి. మొదట త్రిపాఠితో కలిసి ఇన్నింగ్స్‌కు వేగాన్ని అందించిన అతను.. చివరి వరకూ బాదుడు కొనసాగించాడు. పేలవ ఫామ్‌ కొనసాగిస్తూ ఇషాన్‌ (1) రెండో ఓవర్లోనే పెవిలియన్‌ చేరినా.. గిల్‌ ఫోర్ల బాటలో సాగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. త్రిపాఠి కూడా ఫెర్గూసన్‌ ఓవర్లో వరుసగా 4, 6తో గేరు మార్చాడు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 58/1. ఆ తర్వాతా భారీ షాట్లతో సాగిన త్రిపాఠి చూస్తుండగానే 40లోకి చేరాడు. కానీ సోధి బౌలింగ్‌లో ఓ సిక్సర్‌ కొట్టిన వెంటనే ఔటైపోయాడు. తనదైన శైలిలో రెండు సిక్సర్లు కొట్టిన సూర్య (24).. మిడాన్‌లో బ్రాస్‌వెల్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌కు నిష్క్రమించాడు. నేలకు తాకేలా కనిపించిన బంతిని కుడివైపు డైవ్‌ చేస్తూ బ్రాస్‌వెల్‌ గొప్పగా ఒడిసిపట్టాడు. కానీ కివీస్‌కు ఎలాంటి ఉపశమనం దక్కలేదు. గిల్‌ సునామీలా ముంచెత్తాడు. 35 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అలవోకగా సిక్సర్లు కొట్టాడు. అరంగేట్ర పేసర్‌ లిస్టర్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు రాబట్టాడు. ఆ తర్వాత టిక్నర్‌ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ కొట్టాడు. బంతి నెమ్మదిగా వస్తే బలంతో, వేగంగా వస్తే టైమింగ్‌తో సిక్సర్ల బాటలో దూసుకెళ్లాడు గిల్‌. ఫెర్గూసన్‌ ఓవర్లో ఫోర్‌తో అతను 54 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. అర్ధసెంచరీ తర్వాత కేవలం 19 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడంటేనే అతని ఊచకోత ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 18వ ఓవర్లోనే జట్టు స్కోరు 200 దాటింది. సెంచరీ తర్వాతా గిల్‌ దూకుడు కొనసాగింది. మరో ఎండ్‌లో హార్దిక్‌ (30) కూడా మెరిశాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు కేవలం 40 బంతుల్లోనే 103 పరుగులు జతచేశారు. అందులో గిల్‌వే 71 (23 బంతుల్లో) పరుగులు కావడం విశేషం. ఆఖరి ఓవర్‌ తొలి బంతికే హార్దిక్‌ను ఔట్‌ చేసిన డరైల్‌ మిచెల్‌ (1/6) ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు.


భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ ఎల్బీ (బి) బ్రాస్‌వెల్‌ 1; శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 126; రాహుల్‌ త్రిపాఠి (సి) ఫెర్గూసన్‌ (బి) సోధి 44; సూర్యకుమార్‌ (సి) బ్రాస్‌వెల్‌ (బి) టిక్నర్‌ 24; హార్దిక్‌ (సి) బ్రాస్‌వెల్‌ (బి) మిచెల్‌ 30; దీపక్‌ హుడా నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 234; వికెట్ల పతనం: 1-7, 2-87, 3-125, 4-228; బౌలింగ్‌: లిస్టర్‌ 4-0-42-0; బ్రాస్‌వెల్‌ 1-0-8-1; ఫెర్గూసన్‌ 4-0-54-0; టిక్నర్‌ 3-0-50-1; సోధి   3-0-34-1; శాంట్నర్‌ 4-0-37-0; మిచెల్‌ 1-0-6-1

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 3; కాన్వే (సి) హార్దిక్‌ (బి) అర్ష్‌దీప్‌ 1; చాప్‌మన్‌ (సి) ఇషాన్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; ఫిలిప్స్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 2; మిచెల్‌ (సి) శివమ్‌ (బి) ఉమ్రాన్‌ 35; బ్రాస్‌వెల్‌ (బి) ఉమ్రాన్‌ 8; శాంట్నర్‌ (సి) సూర్య (బి) శివమ్‌ 13; సోధి (సి) త్రిపాఠి (బి) శివమ్‌ 0; ఫెర్గూసన్‌ (సి) ఉమ్రాన్‌ (బి) హార్దిక్‌ 0; టిక్నర్‌ (సి) ఇషాన్‌ (బి) హార్దిక్‌ 1; లిస్టర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (12.1 ఓవర్లలో ఆలౌట్‌) 66; వికెట్ల పతనం:  1-4, 2-4, 3-5, 4-7, 5-21, 6-53, 7-53, 8-54,  9-66; బౌలింగ్‌: హార్దిక్‌ 4-0-16-4; అర్ష్‌దీప్‌ 3-0-16-2; ఉమ్రాన్‌ 2.1-0-9-2; కుల్‌దీప్‌ 1-0-12-0; శివమ్‌ మావి 2-0-12-2


126

గిల్‌ పరుగులు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌ అతనే. కోహ్లి (122 నాటౌట్‌, 2022లో అఫ్గానిస్థాన్‌పై) రికార్డును బద్దలుకొట్టాడు.


4/16

కివీస్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ బౌలింగ్‌ గణాంకాలు. టీ20ల్లో అతనికిదే అత్యుత్తమ ప్రదర్శన.


66

భారత్‌పై టీ20ల్లో కివీస్‌కిదే అత్యల్ప స్కోరు.


1

స్వదేశంలో 50 టీ20 మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టు భారత్‌.


25

స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్‌ వరుసగా అజేయంగా నిలిచిన సిరీస్‌లు.


168

పరుగుల పరంగా టీ20ల్లో భారత్‌కిదే అతి పెద్ద విజయం. గతంలో 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగులతో గెలిచింది.


* రైనా, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లిల తర్వాత అన్ని ఫార్మాట్లలోనూ శతకాలు చేసిన భారత ఆటగాడు శుభ్‌మనే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని