సంక్షిప్త వార్తలు(4)

ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ఎం.సాహితీవర్షిణి ‘ఫిడే మాస్టర్‌’ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఉమన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌, ఉమన్‌ ఫిడే మాస్టర్‌, ఉమన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిల్స్‌ సాధించిన సాహితి వర్షిణి.. తాజాగా బుధవారం ‘ఫిడే మాస్టర్‌’ అయింది.

Updated : 09 Feb 2023 08:42 IST

వర్షిణికి ‘ఫిడే మాస్టర్‌’ టైటిల్‌

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ఎం.సాహితీవర్షిణి ‘ఫిడే మాస్టర్‌’ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఉమన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌, ఉమన్‌ ఫిడే మాస్టర్‌, ఉమన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిల్స్‌ సాధించిన సాహితి వర్షిణి.. తాజాగా బుధవారం ‘ఫిడే మాస్టర్‌’ అయింది. ఏడాదిగా వివిధ టోర్నీల్లో ఆమె నిలకడగా రాణిస్తోంది. తండ్రి వద్దే శిక్షణ తీసుకుంటున్న వర్షిణి ఇప్పటివరకు తొమ్మిది అంతర్జాతీయ పతకాలు సాధించింది.


భారత జట్ల శుభారంభం

చెన్నై: ఆసియా జూనియర్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్లు శుభారంభం చేశాయి. పార్థ్‌, శౌర్య, కృష్ణలతో కూడిన భారత పురుషుల జట్టు 3-0తో సింగపూర్‌పై, 3-0తో చైనీస్‌ తైపీపై నెగ్గింది. మహిళల విభాగంలో భారత్‌ 3-0తో శ్రీలంకపై విజయం సాధించింది. పూజ, యువ్నా, అనహత్‌ భారత జట్టు సభ్యులు.


జూన్‌ 7 నుంచి ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌

దుబాయ్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) రెండో సీజన్‌ ఫైనల్‌ తేదీలు, వేదిక ఖరారయ్యాయి. ఈ ఏడాది జూన్‌ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని బుధవారం ఐసీసీ ధ్రువీకరించింది.


విజయంతో సమరానికి

స్టెలెన్‌బాష్‌: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత మహిళల జట్టుకు స్ఫూర్తినిచ్చే విజయం. చివరి వార్మప్‌ మ్యాచ్‌లో బుధవారం టీమ్‌ఇండియా 52 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. రిచా ఘోష్‌ (91 నాటౌట్‌; 56 బంతుల్లో 3×4, 9×6) సిక్సర్లతో విరుచుకుపడింది. జెమీమా (41; 27 బంతుల్లో 6×4, 1×6)తో కలిసి ఆమె ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించింది. ఈ జోడీ బౌండరీల వేటలో దూసుకెళ్లింది. దీంతో ఓ దశలో 6 ఓవర్లకు 35/3తో కష్టాల్లో ఉన్న జట్టు.. వీళ్ల దూకుడుతో పుంజుకుంది. ఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో నిగార్‌ సుల్తానా (40) టాప్‌స్కోరర్‌. భారత బౌలర్లలో దేవిక వైద్య (2/21) రాణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని