సంక్షిప్త వార్తలు

బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ ఆ దేశం తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం సాధించాడు.

Published : 21 Mar 2023 03:17 IST

ముష్ఫికర్‌ రికార్డు శతకం

సిలెట్‌: బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ ఆ దేశం తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం సాధించాడు. ఐర్లాండ్‌తో రెండో వన్డేల్లో ముష్ఫికర్‌ 60 బంతుల్లోనే సెంచరీ (100 నాటౌట్‌; 14×4, 2×6) చేశాడు. ముష్ఫికర్‌ 33వ ఓవర్లో క్రీజులోకి వచ్చి, ఇన్నింగ్స్‌ చివరి బంతికి శతకాన్నందుకున్నాడు. లిటన్‌ దాస్‌ (70), నజ్ముల్‌ శాంటో (73), తౌహిద్‌ హృదాయ్‌ (49) కూడా రాణించడంతో బంగ్లా 50 ఓవర్లలో 6 వికెట్లకు 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే బంగ్లా ఇన్నింగ్స్‌ అయ్యాక వర్షం ముంచెత్తడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మూడు వన్డేల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో బంగ్లా నెగ్గింది.


‘లక్ష్య’ అథ్లెట్‌ సంజయ్‌కు కాంస్యం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మరో పతకం ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ల ఖాతాలో చేరింది. సోమవారం పుణెలో జరిగిన పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌11 విభాగంలో నీలం సంజయ్‌ రెడ్డి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. అనంతపురానికి చెందిన అతను పోటీల్లో మంచి ప్రదర్శనతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి విద్యా సంస్థల  సుదీర్ఘ కాల అథ్లెటిక్స్‌ శిక్షణ శిబిరానికి చెందిన రవికిరణ్‌ జావెలిన్‌ త్రోలో కాంస్యం నెగ్గాడు.


నాదల్‌.. 18 ఏళ్లలో తొలిసారి

ఇండియన్‌వెల్స్‌: స్పెయిన్‌ దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో చోటు కోల్పోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతను నాలుగు స్థానాలు తగ్గి 13వ ర్యాంకుకు పరిమితం అయ్యాడు. గత 18 ఏళ్లలో నాదల్‌ టాప్‌-10లో చోటు కోల్పోవడం ఇదే తొలిసారి. జకోవిచ్‌ను వెనక్కి నెట్టి అల్కరాజ్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు.


న్యూయార్క్‌.. ముంబయి సొంతం

దిల్లీ: అమెరికా వేదికగా జరగనున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)లో మరో భారత జట్టు అడుగుపెట్టింది. జులై 13న ఆరంభం కానున్న ఈ లీగ్‌లో న్యూయార్క్‌ ఫ్రాంఛైజీని ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది. ఇంతకుముందు జీఎంఆర్‌ గ్రూప్‌ సారథ్యంలోని దిల్లీ క్యాపిటల్స్‌.. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి సియాటెల్‌ ఆర్కాస్‌ జట్టులో పెట్టుబడులు పెట్టింది. టెక్సాస్‌ జట్టులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమానిగా ఉంది. ‘‘ముంబయి కుటుంబంలోకి న్యూయార్క్‌ ఫ్రాంఛైజీని ఆహ్వానిస్తున్నాం. అమెరికాలో జరుగుతున్న తొలి టీ20 లీగ్‌లో ముంబయి రాక మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఇది మాకు మరో ఆరంభం’’ అని ఆ జట్టు యజమాని నీతా అంబానీ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగుల్లో ముంబయికి న్యూయార్క్‌ అయిదో ఫ్రాంఛైజీ. ముంబయి ఇండియన్స్‌ (ఐపీఎల్‌), ఎంఐ కేప్‌టౌన్‌ (ఎస్‌ఏ20), ఎంఐ ఎమిరేట్స్‌ (ఐఎల్‌టీ20), ముంబయి ఇండియన్స్‌ (డబ్ల్యూపీఎల్‌) ఇప్పటికే ముంబయి తరఫున ఆడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని