IPL 2023: పంజాబ్‌కు దిల్లీ చెక్‌

ఇప్పటికే ఐపీఎల్‌-16 ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన దిల్లీ క్యాపిటల్స్‌.. తనకు నామమాత్రమైన మ్యాచ్‌లో రెచ్చిపోయింది. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోవడంతో 200+ స్కోరు చేసి.. కీలక పోరులో పంజాబ్‌కు చెక్‌ పెట్టింది.

Updated : 18 May 2023 07:40 IST

కింగ్స్‌ ఇక ప్లేఆఫ్స్‌కు కష్టమే
రొసో విధ్వంసక ఇన్నింగ్స్‌
లివింగ్‌స్టన్‌ పోరాటం వృథా

ఇప్పటికే ఐపీఎల్‌-16 ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన దిల్లీ క్యాపిటల్స్‌.. తనకు నామమాత్రమైన మ్యాచ్‌లో రెచ్చిపోయింది. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోవడంతో 200+ స్కోరు చేసి.. కీలక పోరులో పంజాబ్‌కు చెక్‌ పెట్టింది. లివింగ్‌స్టన్‌ సంచలన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌లో ఆశలు రేపినా.. విజయం దిల్లీనే వరించింది. ఏడో ఓటమిని ఖాతాలో వేసుకున్న కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు ముందంజ వేయాలంటే చివరి మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతో పాటు.. మిగతా జట్ల ఫలితాలు కలిసిరావాలి.

ధర్మశాల

ఐపీఎల్‌-16లో ప్లేఆఫ్స్‌కు దూరమైన దిల్లీ.. పంజాబ్‌ అవకాశాలను కూడా దెబ్బ తీసింది. బుధవారం ఆ జట్టు 15 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రిలీ రొసో (82 నాటౌట్‌; 37 బంతుల్లో 6×4, 6×6), వార్నర్‌ (46; 31 బంతుల్లో 5×4, 2×6), పృథ్వీ షా (54; 38 బంతుల్లో 7×4, 1×6) మెరుపులతో దిల్లీ 2 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో లివింగ్‌స్టన్‌ (94; 48 బంతుల్లో 5×4, 9×6) గొప్పగా పోరాడినా.. పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు. నోకియా (2/36), ఇషాంత్‌ శర్మ (2/36), అక్షర్‌ పటేల్‌ (1/27) ఆ జట్టును దెబ్బ తీశారు. 13 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కిది ఏడో ఓటమి. ఆ జట్టు మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.

ఆశలు రేపిన అతడు..: ఒక దశ వరకు పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సాగిన తీరు చూస్తే.. ఆ జట్టు లక్ష్యానికి చేరువగా వస్తుందనే అనిపించలేదు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ (ఖలీల్‌ అహ్మద్‌)ను ప్రభ్‌సిమ్రన్‌ (22) మెయిడెన్‌ ఆడితే.. ఎదుర్కొన్న తొలి బంతికే ధావన్‌ వెనుదిరిగాడు. 214 పరుగుల ఛేదనలో పంజాబ్‌కు దక్కిన ఆరంభమిది. ప్రభ్‌సిమ్రన్‌ కాస్త వేగం అందుకున్నప్పటికీ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అథర్వ (55 రిటైర్డ్‌ ఔట్‌; 42 బంతుల్లో 5×4, 2×6) మాత్రం దిల్లీ పేలవ ఫీల్డింగ్‌ పుణ్యమా అని ఇన్నింగ్స్‌ కొనసాగించగలిగాడు. అయితే 9 ఓవర్లకు పంజాబ్‌ 63 పరుగులే చేయగలిగింది. 11 ఓవర్లలో 151 పరుగులతో సమీకరణం చాలా కష్టంగా మారింది. ఈ స్థితిలో లివింగ్‌స్టన్‌ ఆశలు కోల్పోకుండా వీర బాదుడు మొదలుపెట్టాడు. అతను సిక్సర్ల మోత మోగించడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. కానీ మరో ఎండ్‌లో అథర్వ బంతులు వృథా చేసేశాడు. 15వ ఓవర్‌ అయ్యాక అతను రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగినా.. అప్పటికే చాలా నష్టం చేశాడు. చివరి 5 ఓవర్లలో 86 పరుగులు చేయాల్సిన స్థితిలో లివింగ్‌స్టన్‌ పోరాటం కొనసాగించినా.. అవతలి ఎండ్‌ నుంచి అతడికి సహకారం అందలేదు. జితేశ్‌ (0), షారుక్‌ (6) ఎక్కువసేపు నిలవలేదు. అయితే ముకేశ్‌ వేసిన 18వ ఓవర్లో 21 పరుగులు రావడం.. సమీకరణం 2 ఓవర్లలో 38గా మారడంతో పంజాబ్‌లో ఆశలు చిగురించాయి. కానీ నోకియా 19వ ఓవర్లో 5 పరుగులే ఇచ్చి కరన్‌ (11)ను ఔట్‌ చేశాడు.  హర్‌ప్రీత్‌ (0) రనౌటయ్యాడు. చివరి ఓవర్లో (ఇషాంత్‌) 33 పరుగులు అవసరం కాగా.. 2, 3, 4 బంతులకు లివింగ్‌స్టన్‌ 6, 4, 6 బాదాడు. నాలుగో బంతి నోబాల్‌ కావడంతో చివరి 3 బంతులకు మూడు సిక్సర్లు బాదితే పంజాబ్‌ గెలిచే పరిస్థితి వచ్చింది. కానీ వరుసగా రెండు డాట్స్‌ వేసిన ఇషాంత్‌ చివరి బంతికి లివింగ్‌స్టన్‌ను ఔట్‌ చేసి పంజాబ్‌ కథ ముగించాడు.

రెచ్చిపోయిన రొసో: టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ.. ఎలాగూ ప్లేఆఫ్స్‌ అవకాశాలు చేజారడంతో అదురు బెదురు లేకుండా ఆడింది. వార్నర్‌ దూకుడు కొనసాగించగా.. నామమాత్రపు మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న పృథ్వీ షా ఈ సీజన్లో తొలిసారి ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. వీళ్లిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయగా.. రొసో విధ్వంసక బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు. వార్నర్‌, పృథ్వీ తొలి రెండు ఓవర్లు మాత్రమే ఆచితూచి ఆడారు. ఆ రెండు ఓవర్లలో 6 పరుగులే వచ్చాయి. తర్వాత ఇద్దరూ బౌండరీల మోత మోగించడంతో 6 ఓవర్లకే దిల్లీ 61/0కు చేరుకుంది. 10 ఓవర్లకు 93/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లో సామ్‌ కరన్‌.. వార్నర్‌ను ఔట్‌ చేసినా దిల్లీకి ఇబ్బంది లేకపోయింది. క్రీజులోకి వచ్చీ రాగానే భారీ షాట్లకు దిగిన రొసో పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే రెండు ఫోర్లు కొట్టిన రొసో.. తర్వాత రబాడ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 బాదాడు. అతను 25 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. పృథ్వీ ఔటయ్యాక వచ్చిన ఫిల్‌ సాల్ట్‌ (26 నాటౌట్‌; 14 బంతుల్లో 2×4, 2×6) సైతం ఆఖర్లో చెలరేగి ఆడటంతో దిల్లీ అలవోకగా 200 దాటేసింది. చివరి 2 ఓవర్లలోనే 41 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌ వేసిన స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ 23 పరుగులు సమర్పించుకున్నాడు.

దిల్లీ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) ధావన్‌ (బి) కరన్‌ 46; పృథ్వీ షా (సి) అథర్వ (బి) కరన్‌ 54; రొసో నాటౌట్‌ 82; సాల్ట్‌ నాటౌట్‌ 26; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 213; వికెట్ల పతనం: 1-94, 2-148; బౌలింగ్‌: సామ్‌ కరన్‌ 4-0-36-2; రబాడ 3-0-36-0; అర్ష్‌దీప్‌ 2-0-21-0; ఎలిస్‌ 4-0-46-0; రాహుల్‌ చాహర్‌ 4-0-35-0; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3-0-39-0

పంజాబ్‌ కింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) యశ్‌ (బి) అక్షర్‌ 22; ధావన్‌ (సి) అమన్‌ హకీమ్‌ (బి) ఇషాంత్‌ 0; అథర్వ రిటైర్డ్‌ ఔట్‌ 55; లివింగ్‌స్టోన్‌ (సి) అక్షర్‌ (బి) ఇషాంత్‌ 94; జితేశ్‌ (సి) ఖలీల్‌ (బి) నోకియా 0; షారుఖ్‌ ఖాన్‌ (సి) అక్షర్‌ (బి) ఖలీల్‌ 6; సామ్‌ కరన్‌ (బి) నోకియా 11; హర్‌ప్రీత్‌ బ్రార్‌ రనౌట్‌ 0; రాహుల్‌ చాహర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 198; వికెట్ల పతనం: 1-0, 2-50, 3-128, 4-129, 5-147, 6-180, 7-180, 8-198; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 3-1-20-1; ఇషాంత్‌ శర్మ 3-0-36-2; నోకియా 4-0-36-2; ముకేశ్‌ కుమార్‌ 4-0-52-0; అక్షర్‌ పటేల్‌ 3-0-27-1; కుల్దీప్‌ యాదవ్‌ 3-0-21-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని