చెన్నై దంచేసింది

చెన్నై దంచేస్తోంది. గత ఐపీఎల్‌లో అనూహ్యంగా చతికిలపడ్డ సూపర్‌కింగ్స్‌ ఈసారి దూసుకెళ్తోంది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. మళ్లీ పాత చెన్నైలా మారిపోయింది. సన్‌రైజర్స్‌పై మామూలుగా రెచ్చిపోలేదు. హైలైట్స్‌ను చూసినట్లే బౌండరీల మోత. డుప్లెసిస్‌, రుతురాజ్‌ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ వేళ.. వార్నర్‌ బృందాన్ని చిత్తుగా ఓడించింది చెన్నై. 172 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌న ఊదేసింది. ధోనీసేన అయిదో విజయంతో

Updated : 29 Apr 2021 11:20 IST

 మెరిసిన రుతురాజ్‌, డుప్లెసిస్‌
 సన్‌రైజర్స్‌ చిత్తు

చెన్నై దంచేస్తోంది. గత ఐపీఎల్‌లో అనూహ్యంగా చతికిలపడ్డ సూపర్‌కింగ్స్‌ ఈసారి దూసుకెళ్తోంది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. మళ్లీ పాత చెన్నైలా మారిపోయింది. సన్‌రైజర్స్‌పై మామూలుగా రెచ్చిపోలేదు. హైలైట్స్‌ను చూసినట్లే బౌండరీల మోత. డుప్లెసిస్‌, రుతురాజ్‌ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ వేళ.. వార్నర్‌ బృందాన్ని చిత్తుగా ఓడించింది చెన్నై. 172 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌న ఊదేసింది. ధోనీసేన అయిదో విజయంతో పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానాన్ని అందుకుంది.

దిల్లీ

చెన్నై సూపర్‌కింగ్స్‌ అదరగొట్టింది. అలవోకగా పని పూర్తి చేసింది. ఆల్‌రౌండ్‌  ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించింది. మనీష్‌ పాండే (61; 46 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో మొదట సన్‌రైజర్స్‌ 3 వికెట్లకు 171 పరుగులు చేసింది. విలియమ్సన్‌ (26 నాటౌట్‌; 10 బంతుల్లో 4×4, 1×6) మెరిశాడు. వార్నర్‌ (57; 55 బంతుల్లో 3×4, 2×6) అర్ధసెంచరీ సాధించినా.. మరీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. చెన్నై ఛేదనలో సన్‌రైజర్స్‌ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (75; 44 బంతుల్లో 12×4), డుప్లెసిస్‌ (56; 38 బంతుల్లో 6×4, 1×6) చెలరేగడంతో లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రషీద్‌ ఖాన్‌ (3/36) మాయాజాలం సరిపోలేదు.
రుతురాజ్‌, డుప్లెసిస్‌ ధనాధన్‌: ఛేదనలో చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌ చెలరేగిపోయారు. ఎడాపెడా ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వాళ్లు కాస్త శాంతంగా ఉన్నది తొలి మూడు ఓవర్లలోనే. ఆ తర్వాత దంచుతూ పోయారు. సన్‌రైజర్స్‌ బౌలర్లు వారిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మొదట దూకుడు ప్రదర్శించింది డుప్లెసిస్‌ అయినా.. క్రమంగా జోరందుకున్న రుతురాజ్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించాడు. ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో ముచ్చటైన షాట్లతో వరుసగా రెండు ఫోర్లు బాదిన డుప్లెసిస్‌.. వెంటనే కౌల్‌ బౌలింగ్‌లోనూ రెండు బంతులను బౌండరీకి తరలించాడు. సుచిత్‌ ఓవర్లోనూ ఓ సిక్స్‌, ఫోర్‌ సాధించాడు. సుచిత్‌ అంతకుముందు ఓవర్లో రెండు బంతులను రుతురాజ్‌ మిడ్‌వికెట్‌ బౌండరీకి తరలించాడు. 10 ఓవర్లకు స్కోరు 91/0. ఆ తర్వాత డుప్లెసిస్‌ అర్ధశతకం (32 బంతుల్లో) పూర్తి చేశాడు. సాధికారిక షాట్లతో అలరించిన రుతురాజ్‌.. 12వ ఓవర్లో సుచిత్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు రాబట్టాడు. ఆ క్రమంలో 36 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. వెంటనే మాయగాడు రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లోనూ బంతికి మూడు సార్లు బౌండరీని చూపించాడు. కానీ అదే ఓవర్లో ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 129. రషీద్‌ తన తర్వాతి ఓవర్లో మొయిన్‌ అలీ (15), డుప్లెసిస్‌లను ఔట్‌ చేసి కాస్త ఆసక్తిరేపినా.. చెన్నైకి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. 15వ ఓవర్లో డుప్లెసిస్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 148. రైనా (17 నాటౌట్‌), జడేజా (7 నాటౌట్‌) ఎలాంటి నాటకీయతకు అవకాశమివ్వకుండా పని పూర్తి చేశారు.
రాణించిన పాండే: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ త్వరగానే ఓపెనర్‌ బెయిర్‌స్టో వికెట్‌ను చేజార్చుకుంది. బెయిర్‌స్టో (7) నాలుగో ఓవర్లోనే ఔటయ్యాడు. కానీ మరో ఓపెనర్‌ వార్నర్‌, మనీష్‌ పాండే జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. పాండే కాస్త దూకుడు ప్రదర్శించినా.. వార్నర్‌ మాత్రం మరీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. సాధికారికంగా బ్యాటింగ్‌ చేయలేకపోయిన వార్నర్‌.. పరుగుల కోసం చాలా కష్టపడ్డాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. 10 ఓవర్లయ్యేసరికి సన్‌రైజర్స్‌ స్కోరు 69/1 కాగా.. వార్నర్‌ 35 బంతుల్లో 29 పరుగులే చేశాడు. అప్పటికి పాండే 20 బంతుల్లో 29 సాధించాడు. ఆ తర్వాత పాండే శార్దూల్‌, జడేజా బౌలింగ్‌ల్లో పాండే సిక్స్‌లు కొట్టాడు. 35 బంతుల్లో అర్దశతకం పూర్తి చేశాడు. 14వ ఓవర్లో సన్‌రైజర్స్‌ స్కోరు 100 దాటింది. ఆ తర్వాత వార్నర్‌ గేర్‌ మార్చే ప్రయత్నం చేశాడు. ఎంగిడి, జడేజా బౌలింగ్‌లో సిక్స్‌లు బాదినా జట్టు కోరుకున్న స్థాయిలో మాత్రం విధ్వంసం సృష్టించలేకపోయాడు. ఎంగిడి వేసిన 18వ ఓవర్లో ఓ భారీ షాట్‌కు యత్నించి జడేజా చేతికి చిక్కాడు. అదే ఓవర్లో పాండే కూడా ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 134. దీంతో సన్‌రైజర్స్‌ 150కి కాస్త అటు ఇటు స్కోరుతో సరిపెట్టుకుంటుందేమో అనిపించింది. కానీ కేన్‌ విలియమ్సన్‌ విధ్వంసం.. కేదార్‌ జాదవ్‌ (12 నాటౌట్‌; 4 బంతుల్లో 1×4, 1×6) కొస మెరుపులతో స్కోరు అనూహ్యంగా 170 దాటింది. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో విలియమ్సన్‌ వరుసగా 4, 6, 4, 4 దంచగా.. చివరి ఓవర్‌ చివరి రెండు బంతుల్లో కేదార్‌ వరుసగా 4, 6 కోట్టాడు. ఆఖరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్‌కు   33 పరుగులు వచ్చాయి. ఎంగిడి రెండు వికెట్లు పడగొట్టాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) జడేజా (బి) ఎంగిడి 57; బెయిర్‌స్టో (సి) చాహర్‌ (బి) కరన్‌ 7; మనీష్‌ పాండే (సి) డుప్లెసిస్‌ (బి) ఎంగిడి 61; విలియమ్సన్‌ నాటౌట్‌ 26; కేదార్‌ జాదవ్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-22, 2-128, 3-134;  బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-21-0; సామ్‌ కరన్‌ 4-0-30-1; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-44-0; మొయిన్‌ అలీ 2-0-16-0; ఎంగిడి 4-0-35-2; జడేజా 3-0-23-0
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (బి) రషీద్‌ 75; డుప్లెసిస్‌ ఎల్బీ (బి) రషీద్‌ 56; మొయిన్‌ అలీ (సి) జాదవ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 15; జడేజా నాటౌట్‌ 7; రైనా నాటౌట్‌ 17; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 173; వికెట్ల పతనం: 1-129, 2-148, 3-148; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 3.3-0-24-0; ఖలీల్‌ అహ్మద్‌ 4-0-36-0; సిద్ధార్థ్‌ కౌల్‌ 4-0-32-0; సుచిత్‌ 3-0-45-0; రషీద్‌ ఖాన్‌ 4-0-36-3

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని