
T20 World Cup: పాక్ అజేయం
షోయబ్, బాబర్ మెరుపులు
స్కాట్లాండ్ చిత్తు
షార్జా: టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు దక్కించుకున్న పాకిస్థాన్ మరో ఘన విజయంతో లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన గ్రూప్-2 పోరులో పాక్ 72 పరుగుల తేడాతో పసికూన స్కాట్లాండ్‌ను చిత్తు చేసి వరుసగా అయిదో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు చేసింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (54 నాటౌట్; 18 బంతుల్లో 1×4, 6×6) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన అతడు కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి పాక్‌కు అనూహ్యమైన స్కోరు సాధించిపెట్టాడు. 18 ఓవర్లకు 146/4తో ఉన్న పాక్.. చివరికి భారీ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించిందంటే షోయబ్ ఊచకోతే కారణం. 19వ ఓవర్లో రెండు సిక్స్‌లు దంచిన అతడు.. గ్రీవ్స్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మూడు సిక్స్‌లు, ఫోర్ బాదేశాడు. సిక్స్‌తో అతడు అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో పాక్ 26 పరుగులు రాబట్టింది. అంతకుముందు ధాటిగా ఆడిన కెప్టెన్ బాబర్ అజామ్ (66; 47 బంతుల్లో 5×4, 3×6).. హఫీజ్ (31)తో కలిసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 53 పరుగులు జత చేసింది. బదులుగా స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 117 పరుగులే చేయగలిగింది. రిచీ బారింగ్టన్ (54 నాటౌట్; 37 బంతుల్లో 4×4, 1×6) మాత్రమే పోరాడాడు. షాదాబ్‌ఖాన్ (2/14), షహీన్ షా అఫ్రిది (1/24), హరిస్ రవూఫ్ (1/27) ప్రత్యర్థిని కట్టడి చేశారు. పాక్ బౌలర్ల దెబ్బకు స్కాట్లాండ్ ఏ దశలోనూ విజయం దిశగా పయనించలేదు. బారింగ్టన్ అర్ధసెంచరీ చేయకపోతే ఆ జట్టు ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు.
పాకిస్థాన్: 20 ఓవర్లలో 189/4 (బాబర్ అజామ్ 66, షోయబ్ మాలిక్ 54 నాటౌట్, హఫీజ్ 31; గ్రీవ్స్ 2/43);
స్కాట్లాండ్: 20 ఓవర్లలో 117/6 (రిచీ బారింగ్టన్ 54 నాటౌట్; షాదాబ్‌ఖాన్ 2/14)