Published : 22 Jan 2022 03:43 IST

ఒసాక.. కథ ముగిసె

డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు అనిసిమోవా షాక్‌
స్వితోలిన కూడా ఔట్‌
ప్రి క్వార్టర్స్‌లో నాదల్‌, బార్టీ
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నవోమి ఒసాక పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. ఈ నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేతకు అమెరికా భామ అనిసిమోవా చెక్‌ పెట్టింది. మరోవైపు స్వితోలినాకు అజరెంక షాకిచ్చింది. 21వ టైటిల్‌ వేటలో దూసుకెళ్తోన్న దిగ్గజం నాదల్‌.. సొంతగడ్డపై ట్రోఫీ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న టాప్‌సీడ్‌ ఆష్లీ బార్టీ ప్రి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

మెల్‌బోర్న్‌: వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలవాలనే ఒసాక (జపాన్‌) కల తీరలేదు. రెండో రౌండ్లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ బెన్సిచ్‌కు షాకిచ్చిన అనిసిమోవా (అమెరికా).. తాజాగా ఒసాకాను ఇంటికి పంపించింది. శుక్రవారం ఉత్కంఠగా సాగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో పదమూడో సీడ్‌ ఒసాక 6-4, 3-6, 6-7 (5-10) తేడాతో 20 ఏళ్ల అనిసిమోవా చేతిలో ఓడింది. ప్రపంచ 60వ ర్యాంకర్‌ అనిసిమోవాతో పోరులో ఒసాక ఆరంభంలో ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ మొదటి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమె.. ఓ దశలో 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ అనిసిమోవా ప్రతిఘటించడంతో పోరు హోరాహోరీగా మారింది. 4-5తో ఆమె ఒసాకాను అందుకునే దిశగా సాగింది. కానీ ఆ తర్వాతి గేమ్‌ను విన్నర్‌తో ముగించిన ఒసాక తొలి సెట్‌ నెగ్గింది. రెండో సెట్లో అనిసిమోవా బలంగా పుంజుకుంది. విన్నర్లతో చెలరేగింది. సర్వీస్‌లతో హడలెత్తించింది. నాలుగో గేమ్‌లో ఒసాక సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమె 3-1తో ఆధిక్యం సాధించింది. అదే జోరు కొనసాగించి సెట్‌ ఖాతాలో వేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో పోరు మరోస్థాయికి చేరింది. ఇద్దరు క్రీడాకారిణులు పాయింట్ల కోసం ప్రాణం పెట్టారు. సుదీర్ఘ ర్యాలీలు, అదిరే షాట్లతో సాగిన ఆ సెట్‌లో రెండు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకున్న అనిసిమోవా పోరును టైబ్రేకర్‌కు మళ్లించింది. అక్కడా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ కీలక సమయంలో ఆధిపత్యం సాధించిన అనిసిమోవా.. ఏస్‌తో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఆమె 11 ఏస్‌లు, 46 విన్నర్లు కొట్టింది. మరో మ్యాచ్‌ల్లో అయిదేళ్ల పిల్లాడి తల్లి అజరెంక (బెలారస్‌) 6-0, 6-2తో స్వితోలిన (ఉక్రెయిన్‌)ను చిత్తుచేసింది. పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసిన ఆమె కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. మరోవైపు సొంతగడ్డపై దూకుడు కొనసాగించిన బార్టీ 6-2, 6-3తో జార్జి (ఇటలీ)పై గెలిచి ప్రి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. నాలుగో సీడ్‌ క్రెజికోవా, అయిదో సీడ్‌ సకారి, ఎనిమిదో సీడ్‌ బడోసా కూడా ముందంజ వేశారు.

మరో అడుగు: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల వీరుడిగా చరిత్ర సృష్టించే దిశగా నాదల్‌ (స్పెయిన్‌) మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ ఆరో సీడ్‌ ఆటగాడు 6-3, 6-2, 3-6, 6-1తో కచనోవ్‌ (రష్యా)పై గెలిచి ప్రి క్వార్టర్స్‌ చేరాడు. 25 ఏళ్ల ప్రత్యర్థితో పోరులో 35 ఏళ్ల నాదల్‌ ఆధిపత్యం చలాయించాడు. చూస్తుండగానే రెండు సెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్లో పుంజుకున్న కచనోవ్‌ నాలుగో గేమ్‌లో సర్వీస్‌ బ్రేక్‌ చేసి 3-1తో ఆధిక్యం సాధించాడు. నాదల్‌కు అవకాశమే ఇవ్వకుండా ఆ సెట్‌ సొంతం చేసుకున్నాడు. కానీ నాలుగో సెట్‌కు వచ్చేసరికి నాదల్‌ మరింతగా చెలరేగాడు. కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయి గెలిచాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-3, 6-4, 6-4తో అల్బాట్‌ (మొల్దోవా)పై నెగ్గాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని