Shane Warne: ఐపీఎల్‌లో షేన్‌వార్న్‌ ముద్ర చెరిగిపోనిది

ఐపీఎల్‌ ఆరంభమైనపుడు అన్ని జట్ల వేలం పూర్తయ్యాక బలాబలాలు చూసి.. టైటిల్‌కు అసలు పోటీలోనే ఉండదని చాలామంది ముందే తీర్మానించేసిన జట్టు రాజస్థాన్‌. పేపర్‌ మీద అంత బలహీనంగా కనిపించిందా జట్టు. స్టార్‌ పవర్‌ చాలా తక్కువగా..

Updated : 06 Mar 2022 12:26 IST

అంత గొప్ప నాయకుడా అని ఆశ్చర్యపోయేలా..

దిల్లీ: ఐపీఎల్‌ ఆరంభమైనపుడు అన్ని జట్ల వేలం పూర్తయ్యాక బలాబలాలు చూసి.. టైటిల్‌కు అసలు పోటీలోనే ఉండదని చాలామంది ముందే తీర్మానించేసిన జట్టు రాజస్థాన్‌. పేపర్‌ మీద అంత బలహీనంగా కనిపించిందా జట్టు. స్టార్‌ పవర్‌ చాలా తక్కువగా.. యువ, అనామక ఆటగాళ్లు ఎక్కువగా ఉన్న ఆ జట్టును తొలి సీజన్లో షేన్‌ వార్న్‌ నడిపించిన వైనం ఒక చరిత్ర. అంచనాల్ని తలకిందులు చేస్తూ.. ఫేవరెట్లనుకున్న జట్లను వెనక్కి నెడుతూ.. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరడమే కాదు.. చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాకిస్తూ టైటిల్‌ కూడా ఎగరేసుకుపోయింది రాయల్స్‌. టైటిల్‌ గెలవడం కంటే కూడా ఆ జట్టు ఆటతీరు అప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాట్సన్‌, యూసుఫ్‌ పఠాన్‌, జడేజా సహా పెద్దగా పేరు లేని యువ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబడుతూ.. చక్కటి వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్‌ పెడుతూ.. తన బౌలింగ్‌ ప్రదర్శనలతో సహచరులకూ స్ఫూర్తినిస్తూ.. వార్న్‌ రాజస్థాన్‌ను తిరుగులేని స్థాయిలో నిలబెట్టిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఆస్ట్రేలియాకు ఆడుతుండగా వార్న్‌ను ఎప్పుడూ, ఎవ్వరూ సారథ్య బాధ్యతలు చేపట్టగల సత్తా ఉన్నవాడిగా చూడలేదు. వైస్‌ కెప్టెన్‌గా మాత్రమే కొంత కాలం జట్టును నడిపించి.. తన ప్రవర్తనతో అది కూడా పోగొట్టుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసే అవకాశం రాగానే దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని, వార్న్‌ ఇంత గొప్ప నాయకుడా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. యువ ప్రతిభను తీర్చిదిద్దడంలో మిగతా జట్లన్నింటికీ రాజస్థాన్‌ స్ఫూర్తిగా నిలిచిందంటే అది వార్న్‌ ఘనతే. ఆటగాడిగా రిటైరయ్యాక కూడా కోచ్‌గా, మెంటార్‌గా అనేక బాధ్యతల్లో కొన్నేళ్ల ముందు వరకు రాయల్స్‌తో కొనసాగిన వార్న్‌.. ఇప్పుడిలా అర్ధంతరంగా తనువు చాలించడం ఆ జట్టుతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ పెద్ద షాక్‌. ‘‘నా కెరీర్‌ ఎదుగుదలలో వార్న్‌ పాత్ర 100 శాతానికంటే ఎక్కువ. రాయల్స్‌ తరఫున సత్తా చాటాక నేను వెనుదిరిగి చూసుకోలేదు. ప్రతి ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునే నిజమైన సారథి వార్న్‌. అతను లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు రాయల్స్‌ మాజీ ఆటగాడు యూసుఫ్‌ పఠాన్‌.

వార్న్‌కు ప్రత్యర్థిగా ఆడడం నాకు దక్కిన గౌరవం. వ్యక్తిగతంగా అతడి గురించి తెలుసుకోగలగడం, సహచరుడిగా అతడితో కలిసి ఆడడం మరింత గౌరవం. నా క్రికెటింగ్‌ కెరీర్‌ హైలైట్స్‌లో అదొకటి.     - ద్రవిడ్‌

* 2011లో వార్న్‌తో కలిసి ద్రవిడ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని