Jeremy lalrinnunga: వాల్‌పేపర్‌ పెట్టాడు.. సాధించాడు

అప్పటివరకూ తన స్నేహితుల చిత్రం లేదా తన పచ్చబొట్టుతో ఉండే అతని ఫోన్‌ వాల్‌పేపర్‌ ఒక్కసారిగా మారిపోయింది. 2022 కామన్వెల్త్‌ క్రీడల పతక నమూనాలు విడుదల కాగానే.. అందులో నుంచి పసిడి పతక డిజైన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ఆ కుర్రాడు

Updated : 01 Aug 2022 09:08 IST

ఈనాడు క్రీడావిభాగం

అప్పటివరకూ తన స్నేహితుల చిత్రం లేదా తన పచ్చబొట్టుతో ఉండే అతని ఫోన్‌ వాల్‌పేపర్‌ ఒక్కసారిగా మారిపోయింది. 2022 కామన్వెల్త్‌ క్రీడల పతక నమూనాలు విడుదల కాగానే.. అందులో నుంచి పసిడి పతక డిజైన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ఆ కుర్రాడు దాన్నే వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడు. ఎలాగైనా ఆ పతకాన్ని అందుకోవాలనే కల కన్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు. ఆ కుర్రాడే.. జెరెమీ లాల్రినుంగా.

చిన్నప్పటి నుంచి మెరిసే పతకాలంటే జెరెమీకి చాలా ఇష్టం. ఎందుకంటే ఒకప్పటి జాతీయ స్థాయి బాక్సర్‌ అయిన తన తండ్రి సాధించిన పతకాలతో అతను బాల్యంలో ఆడుకునేవాడు. వాటిని మెడలో వేసుకుని తనను తాను ఛాంపియన్‌ అనుకునేవాడు. పెద్దయ్యాక తానూ పతకాలు సాధించాలనుకున్నాడు. ఇప్పుడు వెయిట్‌లిఫ్టింగ్‌లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. కానీ అతను మొదట శిక్షణ పొందింది బాక్సింగ్‌లోనే. తన తండ్రితో కలిసి బాక్సింగ్‌ రింగ్‌కు వెళ్లిన అతను.. చేతులకు గ్లౌజులు వేసుకుని సాధన చేశాడు. ఎనిమిదేళ్ల వయసులో అతనూ బాక్సర్‌ కావాలనుకున్నాడు. కానీ తన గ్రామంలో వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతున్న తన  స్నేహితులను చూసిన అతను మనసు మార్చుకున్నాడు. ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఎంపికవడంతో తన కెరీర్‌ మలుపు తిరిగింది. 

తగ్గేదేలే..: పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణలో జెరెమీ వేగంగా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే సంచలనాల మోత మోగించాడు. 13 ఏళ్ల వయసులోనే 2016 ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతంతో ఆశ్చర్యపరిచాడు. 2018 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ఓ రజతం, కాంస్యం సాధించాడు. అదే ఏడాది 15 ఏళ్ల వయసులో యూత్‌ ఒలింపిక్స్‌లో పసిడి పట్టేశాడు. 62 కేజీల విభాగంలో 274 కేజీల ప్రదర్శనతో ఆ క్రీడల చరిత్రలో దేశానికి తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌గా నిలిచాడు. తర్వాత 67 కేజీలకు మారి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ మధ్యలో గాయాలు అతని లయను దెబ్బతీశాయి. నిరుడు కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గే క్రమంలో మరోసారి గాయపడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డెడ్‌లిఫ్ట్‌కు ప్రయత్నించి వెన్నెముక గాయం బారిన పడ్డాడు. దీంతో అతను కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేది అనుమానంగా మారింది. కానీ పట్టుదలతో కోలుకుని ఇప్పుడు స్వర్ణం గెలిచాడు. ఇక అతడి లక్ష్యం పారిస్‌ ఒలింపిక్స్‌ పతకమే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు