CWG 2022: ప్రియాంక, అవినాష్‌ చరిత్ర

భారత అథ్లెట్లు ప్రియాంక గోస్వామి, అవినాష్‌ సాబలే చరిత్ర సృష్టించారు. మహిళల 10 వేల మీటర్ల నడకలో రజతం గెలిచిన ప్రియాంక.. కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారత అమ్మాయిగా నిలిచింది. 43 నిమిషాల 38.83 సెకన్లలో

Published : 07 Aug 2022 05:57 IST

భారత అథ్లెట్లు ప్రియాంక గోస్వామి, అవినాష్‌ సాబలే చరిత్ర సృష్టించారు. మహిళల 10 వేల మీటర్ల నడకలో రజతం గెలిచిన ప్రియాంక.. కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారత అమ్మాయిగా నిలిచింది. 43 నిమిషాల 38.83 సెకన్లలో రేసు ముగించిన ఆమె తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జెమీమ (42:34.30సె- ఆస్ట్రేలియా) పసిడి, ఎమిలీ (43:50.86సె- కెన్యా) కాంస్యం గెలుచుకున్నారు. ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత అథ్లెట్‌ భావన తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన (47:14.13సె) నమోదు చేసినప్పటికీ చివరి స్థానంలో నిలిచింది. పురుషుల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌ సాబలే వెండి పతకం ఖాతాలో వేసుకున్నాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో లాంగ్‌ డిస్టెన్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు. 8 నిమిషాల 11.20 సెకన్ల టైమింగ్‌తో తన జాతీయ రికార్డు (8:12.48సె)ను మెరుగు పర్చుకుని ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 0.05 సెకన్ల తేడాతో అతను పసిడి కోల్పోయాడు. కెన్యా అథ్లెట్లు అబ్రహం (8:11.15సె), సెరెమ్‌ (8:16.83సె) వరుసగా బంగారు, కంచు పతకాలు నెగ్గారు. అథ్లెటిక్స్‌లో నాలుగు పతకాలతో గోల్డ్‌కోస్ట్‌ (3)ను భారత్‌ దాటేసింది. ఇప్పటికే లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్‌ రజతం, హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.

లాన్‌బౌల్స్‌లో మరో పతకం: లాన్‌బౌల్స్‌లో భారత జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మహిళల ఫోర్స్‌ విభాగంలో అమ్మాయిల జట్టుతో పసిడితో చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు పురుషుల జట్టు రజతం గెలిచింది. పురుషుల ఫోర్స్‌ ఫైనల్లో సునీల్‌, నవ్‌నీత్‌, చందన్‌, దినేశ్‌తో కూడిన మన జట్టు 5-18 తేడాతో నార్తర్న్‌ ఐర్లాండ్‌ చేతిలో ఓడింది. పోటీల సాంతం నిలకడగా రాణించిన అబ్బాయిల జట్టు.. తుదిపోరులో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ విభాగంలో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కిదే తొలి పతకం.

జాస్మిన్‌కు కాంస్యం: బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం. కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి పోటీపడ్డ జాస్మిన్‌ కాంస్యం ఖాతాలో వేసుకుంది. 60 కేజీల సెమీస్‌లో ఆమె 2-3తో జెమ్మా రిచర్డ్‌సన్‌ (ఇంగ్లాండ్‌) చేతిలో పోరాడి ఓడింది. పారా టేబుల్‌ టెన్నిస్‌లో సోనాల్‌ బెన్‌ పటేల్‌ కాంస్యం గెలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని