జులన్‌.. చివరిసారిగా

రెండు దశాబ్దాలుగా భారత మహిళల ఫాస్ట్‌బౌలింగ్‌కు పర్యాయ పదంగా కొనసాగిన జులన్‌ గోస్వామి చివరిసారిగా మైదానంలో అడుగుపెట్టబోతుంది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు శనివారం లార్డ్స్‌లో వీడ్కోలు పలకబోతుంది.

Published : 24 Sep 2022 03:15 IST

వీడ్కోలు మ్యాచ్‌కు సిద్ధమైన గోస్వామి
 ఇంగ్లాండ్‌తో నేడే మూడో వన్డే
మధ్నాహ్నం 3:30 నుంచి

లండన్‌: రెండు దశాబ్దాలుగా భారత మహిళల ఫాస్ట్‌బౌలింగ్‌కు పర్యాయ పదంగా కొనసాగిన జులన్‌ గోస్వామి చివరిసారిగా మైదానంలో అడుగుపెట్టబోతుంది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు శనివారం లార్డ్స్‌లో వీడ్కోలు పలకబోతుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డేతో ఆమె క్రికెట్‌ కెరీర్‌ ముగుస్తుంది. ఇప్పటికే 2-0తో ఇంగ్లిష్‌ గడ్డపై 23 ఏళ్ల తర్వాత తిరిగి సిరీస్‌ గెలిచి, జులన్‌ చివరి సిరీస్‌ను చిరస్మరణీయం చేసిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లోనూ గెలవాలనే లక్ష్యంతో ఉంది. విజయంతో జులన్‌కు వీడ్కోలు పలకాలని టీమ్‌ఇండియా పట్టుదలతో కనిపిస్తోంది. ఈ సీనియర్‌ పేసర్‌ కోసం సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌.. గెలుపు దిశగా జట్టును నడిపించాల్సి ఉంది.

అదొక్కటే లోటు: రెండు దశాబ్దాలుగా సాగిన తన కెరీర్‌లో ప్రపంచకప్‌ గెలవకపోవడం ఒక్కటే లోటు అని చివరి అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైన జులన్‌ గోస్వామి తెలిపింది. ‘‘రెండు ప్రపంచకప్‌ ఫైనల్స్‌ ఆడా. అందులో ఒక్కటి గెలిచినా నాతో పాటు జట్టుకూ మంచిగా ఉండేది. ప్రతి క్రికెటర్‌ ఆ లక్ష్యం కోసం పనిచేస్తారు. కానీ మేం అందుకోలేకపోయాం. అదొక్కటే నాకు విచారం కలిగిస్తోంది. ఓ ప్రపంచకప్‌ కోసం నాలుగేళ్లుగా సన్నద్ధమవ్వాలి. అందుకు ఎంతో కష్టపడాలి. కప్పు గెలవడమనేది ప్రతి క్రికెటర్‌కు కల నిజమయ్యే క్షణం. నేను ఆట మొదలెట్టినప్పుడు ఇంత సుదీర్ఘ కాలం కొనసాగుతానని అనుకోలేదు. ఇదో గొప్ప అనుభవం. ఇది అదృష్టంగా భావిస్తున్నా. పశ్చిమ బెంగాల్‌లోని మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు మొదట్లో మహిళల క్రికెట్‌ గురించి ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు అమ్మాయిల క్రికెట్‌ ఎదుగుదలకు సాక్షిగా నిలిచా. టీమ్‌ఇండియా టోపీ అందుకుని, నా తొలి ఓవర్‌ బౌలింగ్‌ చేయడం నా అత్యుత్తమ జ్ఞాపకం. ఈ ప్రయాణం ఎంతో కఠినంగా సాగింది. శిక్షణ కోసం లోకల్‌ రైల్లో ప్రతి రోజు అయిదు గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. 1997లో ఈడెన్‌ గార్డెన్స్‌లో బాల్‌ గర్ల్‌గా తొలిసారి మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌ చూశా. అప్పటి నుంచే దేశానికి ప్రాతినిథ్యం వహించాలనే కల కన్నా. మహిళల ఐపీఎల్‌లో ఆడడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తున్నా. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత జులైలో జరిగిన శ్రీలంక సిరీస్‌ చివరిదనుకున్నా. కానీ అప్పుడు గాయపడ్డా. ఇంగ్లాండ్‌లో చివరి సిరీస్‌ ఆడేందుకు కోలుకున్నా. అండర్‌-19 రోజుల నుంచి మిథాలీతో కలిసి ఆడా. మహిళల క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చగలమని మేం నమ్మాం’’ అని జులన్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని