అదరగొట్టిన జెమీమా

మణికట్టు గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన భారత యువ క్రికెటర్‌ జెమీమా (76; 53 బంతుల్లో 11×4, 1×6) అదరగొట్టింది. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమైన ఈ 22 ఏళ్ల బ్యాటర్‌ పునరాగమనంలో ఆకట్టుకుంది.

Published : 02 Oct 2022 02:39 IST

ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం
శ్రీలంకపై విజయం

సిల్‌హట్‌: మణికట్టు గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన భారత యువ క్రికెటర్‌ జెమీమా (76; 53 బంతుల్లో 11×4, 1×6) అదరగొట్టింది. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమైన ఈ 22 ఏళ్ల బ్యాటర్‌ పునరాగమనంలో ఆకట్టుకుంది. టీ20ల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆమె.. మహిళల ఆసియా కప్‌లో జట్టు శుభారంభంలో కీలక పాత్ర పోషించింది. తన తొలి మ్యాచ్‌లో శనివారం టీమ్‌ఇండియా 41 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. తక్కువ బౌన్స్‌తో బ్యాటర్లకు పరీక్ష పెట్టిన స్లో పిచ్‌పై ఓపెనర్లు షెఫాలీ (10), మంధాన (6) నిలబడలేకపోయారు. 23/2తో కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (33)తో కలిసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా ఆదుకుంది. బ్యాటింగ్‌కు కష్టంగా కనిపించిన పిచ్‌పై గొప్పగా ఆడింది. పూర్తి నియంత్రణ, కచ్చితమైన టైమింగ్‌తో బంతులను బౌండరీకి తరలించింది. హర్మన్‌తో కలిసి మూడో వికెట్‌కు 92 పరుగులు జతచేసింది. ప్రత్యర్థి బౌలర్లలో ఒషాడి రణసింఘె (3/32) రాణించింది. ఛేదనలో పేసర్‌ రేణుక (0/20) వేసిన తొలి ఓవర్లోనే శ్రీలంకకు 13 పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన భారత్‌ ప్రత్యర్థికి కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. హేమలత (3/15), పూజ (2/12), దీప్తి (2/15) ధాటికి ఆ జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. లంక జట్టులో హాసిని (30) టాప్‌స్కోరర్‌. మైదానంలో చురుగ్గా కదిలిన భారత ఫీల్డర్లు రెండు రనౌట్లు కూడా చేశారు. అంతకుముందు టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 9 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌పై గెలిచింది.

బెంగళూరులో ప్రాక్టీస్‌తో: ఆసియా కప్‌నకు ముందు బెంగళూరులోని స్లో, తక్కువ బౌన్స్‌ పిచ్‌పై ఆడడం వల్ల శ్రీలంకతో అలాంటి పరిస్థితుల్లో రాణించగలిగానని జెమీమా చెప్పింది. ‘‘పిచ్‌ చాలా క్లిష్టంగా కనిపించింది. బంతి తక్కువ ఎత్తులో వచ్చింది. మ్యాచ్‌ సాగుతున్నా కొద్దీ స్పిన్‌కు అనుకూలించింది. కానీ ఇలాంటి కఠిన పరిస్థితుల కోసం ముందుగానే సిద్ధమయ్యా. బెంగళూరులో ఇలాంటి స్లో, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై సాధన చేశా’’ అని ఆమె తెలిపింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts