Gill: గిల్‌కు దొరికినంత ప్రోత్సాహం పుజారాకూ దక్కలేదు.. వన్‌డౌన్‌ అత్యంత కీలక స్థానం: అనిల్ కుంబ్లే

ఇప్పుడందరి దృష్టి శుభ్‌మన్‌ గిల్‌పైనే (Shubman Gill) ఉంది. వన్‌డౌన్‌లో ఆడుతున్న అతడు గత కొన్ని మ్యాచుల నుంచి పెద్దగా రాణించడం లేదు. స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. 

Published : 29 Jan 2024 15:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో (IND vs ENG) జరిగిన తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన గిల్.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్‌ స్థానం నుంచి వన్‌డౌన్‌కు మారిన గిల్‌ (Shubman Gill) తన స్థాయి ఆటను ప్రదర్శించడంలో మాత్రం విఫలమవుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ అతడి టాప్‌ స్కోరు 36 పరుగులు. దీంతో అతడిని తప్పించాలనే డిమాండ్లూ వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ గిల్ విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఈ క్రమంలో గిల్‌కు మద్దతుగా నిలుస్తూనే భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కొన్ని కీలక సూచనలు చేశాడు. 

‘‘ వంద టెస్టులు ఆడిన ఛెతేశ్వర్ పుజారాకు కూడా గిల్‌కు దొరికినంత ప్రోత్సాహం, మద్దతు దొరకలేదు. కానీ, గిల్‌ మాత్రం దానిని వృథా చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. మొన్నటి వరకు పుజారా మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడు. ఇప్పుడు గిల్‌ ఆ స్థానం తీసుకున్నాడు. వన్‌డౌన్‌లో ఆడటం ఎప్పుడూ సవాలే. గిల్‌కు అద్భుతమైన టాలెంట్ ఉంది. కానీ, తన ఫామ్‌పై వర్కౌట్‌ చేయాలి. ఇంకా కుర్రాడే కాబట్టి అతడిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. నేర్చుకుంటూ ఉంటాడు. విశాఖ టెస్టు నాటికి తన లోపాలేంటో గిల్ గుర్తించాలి. లేకపోతే ఆ ఒత్తిడి అలానే కొనసాగుతుంది. క్రీజ్‌లో స్వేచ్ఛగా కదలాలి. స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ వెళ్లాలి. స్పిన్నర్ల విషయానికొచ్చేసరికి గిల్ ఇబ్బంది పడుతున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై పరుగులు రాబడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పేసర్లను గిల్ చాలా చక్కగా ఆడతాడు. స్పిన్‌ బౌలింగ్‌లోనే తడబాటుకు గురి కావడం ఆందోళనకరమే. అప్పుడు మణికట్టును వాడాల్సి ఉంటుంది. షాట్ల ఎంపికపైనా శ్రద్ధ పెట్టాలి. తీవ్రంగా శ్రమిస్తేనే స్పిన్‌పై ఆధిపత్యం ప్రదర్శించేందుకు వీలవుతుంది’’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు.

షాట్లు ఆడేందుకూ గిల్ ప్రయత్నించలేదు: పార్థివ్‌

‘‘ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో గిల్ బ్యాటింగ్‌ను చూస్తే టెక్నిక్‌పరంగా ఇబ్బందిపడ్డాడు. కనీసం షాట్లు కొడదామనే ఆలోచన కూడా చేయలేదు. ఫోర్లు కొట్టనప్పుడు స్ట్రైక్‌ను రొటేట్‌ చేయాలి. గిల్‌ బ్యాటింగ్‌లో అదే లోపం కనిపించింది. అంతర్జాతీయ స్థాయి బౌలర్లు  పెద్దగా చెత్త బంతులను వేయరు. అలా వేస్తేనే షాట్లు కొడతానంటే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్‌ పటేల్ విశ్లేషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని