GGT vs UPW: ఆష్లీన్, హేమలత హాఫ్‌ సెంచరీలు.. యూపీ ముందు భారీ లక్ష్యం

డబ్ల్యూపీఎల్‌ (WPL)లో నేడు డబుల్ ధమకా. మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Published : 20 Mar 2023 17:10 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌ (WPL)లో నేడు డబుల్ ధమకా. మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు సాధించింది. హేమలత (57; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆష్లీన్ గార్డ్‌నర్‌ (60; 39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలతో మెరిశారు. సోఫీ డంక్లీ (23), లారా వోల్వార్డ్ట్ (17) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ (4) నిరాశపర్చింది. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అంజలి శ్రావణి, ఎకిల్ స్టోన్‌ ఒక్కో వికెట్ తీశారు. 

గుజరాత్‌కు ఓపెనర్లు డంక్లీ, లారా శుభారంభం అందించారు. ఆది నుంచే దూకుడుగా ఆడారు. రాజేశ్వరి వేసిన రెండో ఓవర్‌లో డంక్లీ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. లారా ఓ సిక్సర్ బాదింది. దీప్తి శర్మ వేసిన లారా ఇంకో సిక్స్‌ కొట్టింది. దీంతో 4 ఓవర్లకు గుజరాత్ 41/0తో పటిష్టంగా కనిపించింది.  అయితే, ఐదో ఓవర్‌లో మొదటి బంతికే లారాను అంజలి క్లీన్‌బౌల్డ్‌ చేసింది. తర్వాతి డంక్లీ, హర్లీన్‌ డియోల్‌ను రాజేశ్వరి పెవిలియన్‌ పంపింది. తర్వాత హేమలత, గార్డ్‌నర్‌ నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అర్ధ శతకాలు పూర్తి చేసుకుని జోరుమీదున్న వీరిద్దరిని పర్శవి చోప్రా వరుస ఓవర్లలో ఔట్‌ చేసింది. ఎకిల్‌ స్టోన్‌ వేసిన చివరి ఓవర్లో అశ్వని కుమారి (5) వికెట్ల ముందు దొరికిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని