Harbhajan Singh: సర్ఫరాజ్‌తో బీసీసీఐ మాట్లాడాలి.. ఆ భరోసా కల్పించాలి : హర్భజన్‌ సింగ్

దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా సర్ఫరాజ్‌ ఖాన్‌కు టీమ్‌ఇండియాలో అవకాశాలు రాకపోవడంపై భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) మాట్లాడాడు.  

Published : 11 Jul 2023 16:33 IST

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan) గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. అయితే, టీమ్‌ఇండియా (Team India)కు మాత్రం ఎంపిక కాలేకపోతున్నాడు. జులై 12 నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు సర్ఫరాజ్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఎప్పటిలాగే సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. అదే సమయంలో ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, రుతురాజ్‌గైక్వాడ్‌ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. దీంతో సెలక్షన్‌ కమిటీపై పలువురు మాజీలతోపాటు అభిమానులు విమర్శలు గుప్పించారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్‌ను ప్రామాణికంగా తీసుకోవడంతోపాటు మైదానం వెలుపల సరైన ప్రవర్తన లేదనే కారణంతోనే అతడికి అవకాశం ఇవ్వలేదని బీసీసీఐ (BCCI) వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh)  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. బీసీసీఐ సర్ఫరాజ్‌ ఖాన్‌తో మాట్లాడాలని, అతడి సేవలు జట్టుకు అవసరం ఉన్నాయని తెలియజేసేలా ప్రయత్నాలు కొనసాగించాలని సూచించాడు. పుజారా (Cheteshwar Pujara)ను జట్టు నుంచి తప్పించడంపై కూడా భజ్జీ మాట్లాడాడు.

‘‘దేశవాళీ క్రికెట్‌లో భారీ స్కోర్లు చేయడంతో సర్ఫరాజ్‌ఖాన్‌కు భారత జట్టులో అవకాశం దక్కనుంది. ఎవరైనా అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారా? అది బీసీసీఐ గాని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు గానీ?.  అతడు రాణిస్తున్నాడు. కాబట్టి మీరు వెళ్లి అతడితో మాట్లాడాల్సిన అవసరముంది. జట్టుకు నీ అవసరం ఉందని చెప్పడానికి ప్రయత్నించండి. భారత జట్టుకు ఎంపిక అవుతావని భరోసా కల్పించండి’’  అని హర్భజన్ సింగ్ బీసీసీఐని కోరాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అంచనాల మేరకు రాణించకపోవడంతో సీనియర్‌ బ్యాటర్ పుజారాపై వేటు వేశారు. విండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. పుజారాను జట్టు నుంచి అలా తప్పించాల్సింది కాదని.. అతడికి గౌరవం ఇవ్వాల్సి ఉండేదని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని