Virat Kohli: నా సూచనలకు డుప్లెసిస్‌ నో చెప్తాడు.. అయినా అతడి కెప్టెన్సీని గౌరవిస్తా: విరాట్ కోహ్లీ

టీ20 లీగ్‌లో చాలా కాలంపాటు చెన్నై జట్టుకి ఆడిన డుప్లెసిస్‌ ఈ ఏడాది బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతడి స్థానంలో డుప్లెసిస్‌ నియమించింది బెంగళూరు జట్టు యాజమాన్యం.

Published : 12 May 2022 01:57 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌లో చాలా కాలంపాటు చెన్నై జట్టుకి ఆడిన డుప్లెసిస్‌ ఈ ఏడాది బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతడి స్థానంలో డుప్లెసిస్‌ను నియమించింది బెంగళూరు జట్టు యాజమాన్యం. అతడి సారథ్యంలో బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. బ్యాటర్‌గా కూడా డుప్లెసిస్‌ మెరుగైన ఆటతీరును  కనబరుస్తున్నాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 389 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే డుప్లెసిస్‌ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ స్పందించాడు.  డుప్లెసిస్‌ కెప్టెన్సీపై గౌరవం ఉందని, కొన్ని సార్లు తన సూచనలకు అతడు నో చెప్పేవాడని కోహ్లీ పేర్కొన్నాడు. 

‘డుప్లెసిస్‌ సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఉన్నప్పుడు, మిగతా సందర్భాల్లో కూడా మేం బాగా కలిసి ఉండేవాళ్ళం. అతడికి మైదానంలో పూర్తి అధికారం ఉంది. కొన్నిసార్లు నేను ఇచ్చిన సూచనలకు నో చెప్పి అలా చేయకూడదని చెప్తాడు. దాన్ని నేను గౌరవిస్తాను. ఇలా చేయడం కెప్టెన్‌ గౌరవాన్ని పొందేలా చేస్తుంది’ అని విరాట్ కోహ్లి  అన్నాడు. వచ్చే ఏడాది ఏబీ డివిలియర్స్ బెంగళూరు జట్టులో కోచింగ్‌ స్టాఫ్‌గా చేరొచ్చనే సంకేతాలను కూడా విరాట్ ఇచ్చాడు. ‘నేను అతడిని (డివిలియర్స్‌) చాలా మిస్ అవుతున్నాను. అతనితో క్రమం తప్పకుండా మాట్లాడతా. డివిలియర్స్‌ ఇటీవల తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లాడు. అతడు బెంగళూరుని నిశితంగా గమనిస్తున్నాడు. వచ్చే ఏడాది డివిలియర్స్‌ జట్టులో చేరతాడని ఆశిస్తున్నా’ అని విరాట్ కోహ్లీ అన్నాడు. డివిలియర్స్‌ గతేడాది అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని