MS Dhoni vs Rohit Sharma: ధోనీకి లభించినంత గుర్తింపు రోహిత్‌కేదీ: గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

చెన్నై సారథి ధోనీతో పోల్చుతూ రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి వచ్చినంత పేరు రోహిత్‌కు రావడం లేదని పేర్కొన్నాడు.

Updated : 26 May 2023 11:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌(IPL)లో ముంబయికి అత్యధికంగా ఐదు సార్లు ట్రోఫీనందించి గొప్ప కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(Rohit Sharma) కొనసాగుతున్నాడు. గత ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన నుంచి పుంజుకుని ఈ సీజన్‌(IPL 2023)లో తిరిగి తన జట్టును టైటిల్‌ రేసులో నిలిపాడు. అయితే, చెన్నై సారథి ధోనీ(MS Dhoni)కి వచ్చినంత పేరు రోహిత్‌కు రాలేదని మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూ(LSG vs MI)పై అకాశ్‌ మధ్వాల్‌(Akash Madhwal) (5/5) అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అతడికి అవకాశమిచ్చి ప్రోత్సహించిన సారథి రోహిత్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, ఇలాంటి విషయాల్లో.. చెన్నై సారథి ధోనీకి వచ్చినంత పేరు హిట్‌మ్యాన్‌కు వస్తుందని తాను అనుకోవడం లేదని గావస్కర్‌ పేర్కొన్నాడు. ‘‘నిజానికి అతడిపై అంచనాలు పెద్దగా ఉండవు. అయితే, అతడు ముంబయి జట్టుకు ఐదు టైటిళ్లు అందించాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను.. మధ్వాల్‌ ఓవర్‌ ది వికెట్‌ బంతిని సంధించి ఆయూష్‌ బదోనీ వికెట్‌ తీశాడు. ఆ తర్వాతి బంతికే లెఫ్ట్‌ హ్యాండర్‌ నికోలస్‌ పూరన్‌ వికెట్‌ను రౌండ్‌ ది వికెట్‌ ద్వారా సంపాదించాడు. చాలా మంది బౌలర్లు అలా చేయరు. ఓవర్‌ ది వికెట్‌ మీదుగా బౌలింగ్‌ చేస్తూ తాము లయను సాధించినప్పుడు.. లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మన్‌ అయినా.. బౌలింగ్‌ శైలిని మార్చుకోరు. అయితే.. ఇక్కడ మధ్వాల్‌ రౌండ్‌ ది వికెట్‌ మీదుగా అధ్భుతంగా బంతిని సంధించి వికెట్‌ పడగొట్టాడు’’ అని గావస్కర్‌ వివరించాడు.

ఒకవేళ ధోనీ సారథ్యంలో.. మధ్వాల్‌ ఇలాంటి ప్రదర్శన చేసి ఉంటే.. క్రికెట్‌ ప్రపంచం అతడి గురించి ఎంతో గొప్పగా చెప్పేదని, కానీ.. రోహిత్‌ విషయంలో అలా జరగదని సన్నీ అన్నాడు. ‘‘ధోనీ సారథ్యంలో ఇలా జరిగితే.. నికోలస్‌ పూరన్‌ను ఔటు చేసేందుకు మహీ వ్యూహ రచనను ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా కీర్తించేవారు. కొద్దిగా ఎక్కువ చేసి చూపించేవారు’’ అని గావస్కర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక లఖ్‌నవూతో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ వ్యూహాలను గావస్కర్‌ ప్రశంసించాడు.

ముంబయి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వధేరాను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తీసుకున్నారు. అయితే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు సాధారణంగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటర్లను తీసుకోరు.  రోహిత్‌ మాత్రం ఇక్కడ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఫలితం సాధించాడని.. దయచేసి అతడికీ క్రెడిట్‌ ఇవ్వండని కోరాడు.

ఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అద్భుత విజయంతో.. ముంబయి నేడు గుజరాత్‌తో రెండో క్వాలిఫయర్‌లో తలపడుతోంది. ఫైనల్‌ చేరడమే లక్ష్యంగా ఆ జట్టు తమ వ్యూహాలకు పదను పెడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు