Rohit Sharma: వాటి వల్ల నిరాశకు గురయ్యా.. కోహ్లీది గొప్ప ఇన్నింగ్స్‌: రోహిత్‌

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించినా ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేయడం కాస్త బాధ కలిగించిందని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు...

Updated : 19 Feb 2022 10:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించినా ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేయడం కాస్త బాధ కలిగించిందని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు. గతరాత్రి భారత జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించి పొట్టి సిరీస్‌నూ 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ నికోలస్‌ పూరన్‌ (62), రోమన్‌ పావెల్‌ (68*) దంచికొట్టడంతో ఒకానొక దశలో ఆ జట్టు విజయం సాధించేలా కనిపించింది. కానీ.. హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులేసి టీమ్‌ఇండియాను గెలిపించారు. కాగా, ఈ విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ అంతకుముందే ఔటయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకొన్నారు. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతూ విరాట్‌ కోహ్లీని మెచ్చుకుంటూనే ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేయడంపై విచారం వ్యక్తం చేశాడు.

‘వెస్టిండీస్‌తో ఆడాలంటే ఎప్పుడూ భయమేస్తుంది. వాళ్లతో పోటీ అంటే కష్టంగా ఉంటుందని తెలుసు. అందుకు తగ్గట్టుగానే మేం సన్నద్ధమై బరిలోకి దిగాం. ఒత్తిడిలోనూ మా ప్రణాళికలన్నీ అమలు చేసినందుకు సంతోషంగా ఉంది. ఇక భువనేశ్వర్‌ బౌలింగ్‌ చేసిన 19వ ఓవర్‌ చాలా కీలకమైనది. అక్కడ అనుభవమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఎన్నో ఏళ్లుగా అతడు అదే పని చేస్తున్నాడు. అతడి టాలెంట్‌పై మాకు నమ్మకం ఉంది’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. అనంతరం కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘మొదట్లోనే అతడు దూకుడుగా ఆడటంతో నాపై ఒత్తిడి తగ్గింది. అతడి నుంచి ఇదో గొప్ప ఇన్నింగ్స్‌. అలాగే పంత్‌, శ్రేయస్ అయ్యర్‌ కూడా బాగా ఆడారు. వారిద్దరూ మంచి ముగింపునిచ్చారు. వెంకటేశ్‌ అయ్యర్‌ లాంటి ఆటగాడు చివర్లో ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేస్తానని కోరాడు. అతడి నుంచి అలాంటి పరిణతి చూడటం ముచ్చటేసింది. అయితే ఫీల్డింగ్‌ విషయంలోనే నేను కాస్త నిరాశకు గురయ్యా. అందులో మేం తడబడ్డాం అనిపించింది. ఒకవేళ వదిలేసిన క్యాచ్‌లు పట్టి ఉంటే మ్యాచ్‌ మరో రకంగా ఉండేది’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. కాగా, ఛేదనలో తొలుత పూరన్‌ 21 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా చాహల్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌లోకి బంతిని గాల్లోకి లేపాడు. కాస్త తక్కువ ఎత్తులో వచ్చిన ఆ బంతిని రవి బిష్ణోయ్‌ క్యాచ్‌ను జారవిడిచాడు. అప్పటికి విండీస్‌ 9 ఓవర్లలో 60 పరుగులు చేసింది. ఇక 26 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన స్థితిలో పావెల్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వగా భువనేశ్వర్‌ నేలపాలు చేశాడు. దీంతో వాళ్లిద్దరికీ జీవనదానం లభించి మ్యాచ్‌ను చివరివరకూ తీసుకెళ్లారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని