IPL 2023: బుమ్రా లేకపోయినా.. ముంబయి విజేతగా నిలుస్తుంది: సన్నీ

ఐపీఎల్‌లో (IPL 2023) ఐదుసార్లు ఛాంపియన్‌.. కానీ, గత సీజన్‌లో దారుణ పరాభవాలతో చివరి స్థానంలోనిలిచింది. ఈసారి మాత్రం ఛాంపియన్‌గా నిలవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Published : 16 Mar 2023 19:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023)లో ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీది ప్రత్యేక జర్నీ. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, గత సీజన్‌లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ క్రమంలో మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబయిని తక్కువగా అంచనా వేయొద్దని క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అలాగే ఆల్‌రౌండర్‌ జై రిచర్డ్‌సన్ కూడా ఆడకపోవచ్చని సమాచారం. అయినా సరే  ముంబయి జట్టు బలంగానే ఉందని సన్నీ చెప్పాడు. 

‘‘గత సీజన్‌లో ఏంజరిగిందనేది ముంబయి ఇండియన్స్‌ జట్టు మరిచిపోవాలి. తిరిగి పుంజుకుంటామని బలంగా నమ్మాలి. స్టార్ పేసర్ బుమ్రాను ముంబయి మిస్‌ చేసుకుంది. అయితే, మరోసారి ఛాంపియన్‌గా నిలిచే జట్టు వారికుంది. తప్పకుండా పాయింట్ల పట్టికలో టాప్‌ - 3లో ముంబయిని చూస్తాం. గతేడాది దారుణమైన ప్రదర్శన నుంచి తొలుత ముంబయి బయటపడాలి’’ అని గావస్కర్ తెలిపాడు. ఏప్రిల్‌ 2వ తేదీన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి తొలి పోరులో తలపడనుంది. బుమ్రా గత ఆరేడు నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం లేదు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఐపీఎల్‌ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ వంటి కీలక టోర్నీలు ఉన్నాయి.

రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి జట్టు ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికంగా ఐదు టైటిళ్లను సొంతం చేసుకున్న చరిత్ర సృష్టించింది. మరోసారి గత వైభవాన్ని పునరావృతం చేయాలని ముంబయి భావిస్తోంది. అయితే బుమ్రా, రిచర్డ్‌సన్ దూరం కావడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అభిమానులను ఆందోళనకు గురి చేసే అంశం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని