T20 World Cup: రాహుల్‌ రాణిస్తే.. కోహ్లిపై ఒత్తిడి ఉండదు : బ్రెట్ లీ

త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ రాణిస్తే.. కెప్టెన్ విరాట్‌ కోహ్లిపై ఒత్తిడి ఉండదని ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ బ్రెట్ లీ అన్నాడు. అప్పుడు కోహ్లి స్వేచ్ఛగా ఆడేందుకు..

Published : 14 Oct 2021 21:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ రాణిస్తే.. కెప్టెన్ విరాట్‌ కోహ్లిపై ఒత్తిడి ఉండదని ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ బ్రెట్ లీ అన్నాడు. అప్పుడు కోహ్లి స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశముంటుందని అతడు పేర్కొన్నాడు. ‘ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రాహుల్‌.. టీ20 ప్రపంచకప్‌లో కూడా టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు. భారత బ్యాటింగ్‌కి అతడు వెన్నెముక. రాహుల్ మెరుగ్గా రాణిస్తే.. కోహ్లిపై ఒత్తిడి తగ్గుతుంది. కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి టీ20 ప్రపంచకప్‌ కాబట్టి.. అతడు తన సహజ శైలిలో స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశముంటుంది. ఇటీవల భారత్ అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చలాయిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కారణంగా నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ కూడా మెరుగ్గా రాణిస్తుండటం భారత్‌కి కలిసొచ్చే అంశం’ అని బ్రెట్ లీ తెలిపాడు.

‘పొట్టి ఫార్మాట్లో ఇంగ్లాండ్ బలమైన జట్టు. అనుభవమున్న ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మిగతా జట్లకు వారి నుంచి ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది. నా వరకైతే భారత్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా ఆస్ట్రేలియా పొట్టి ఫార్మాట్లో రాణించలేకపోతోంది. అయితే, ఈ టీ20 ప్రపంచకప్‌కు అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. టైటిల్ పోరులో అది కచ్చితంగా భారత్‌కి గట్టి పోటీనిస్తుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడిగా కచ్చితంగా మా జట్టే కప్‌ గెలవాలని బలంగా కోరుకుంటున్నా’ అని బ్రెట్‌ లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ నెల 20న ఆస్ట్రేలియా, భారత్ జట్లు దుబాయ్‌లో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని