IND vs AUS: చివర్లో షమీ, హర్షల్‌ మాయ.. వార్మప్‌ మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్‌ విజయం

చివర్లో బౌలర్లు పుంజుకోవడంతో తొలివార్మప్ మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్‌ విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత బౌలింగ్‌ చేసిన మహమ్మద్ షమీ అదరగొట్టాడు. కీలకమైన చివరి ఓవర్‌లో వికెట్లు తీయడంతోపాటు పరుగులు ఇవ్వకుండా గెలిపించాడు. 

Updated : 17 Oct 2022 16:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ చెమటోడ్చి నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 180 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ (76) అర్ధశతకం సాధించాడు. మిచెల్ మార్ష్ (35), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (23) ఫర్వాలేదనిపించారు. చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు చేయాల్సిన క్రమంలో.. ఆసీస్‌ ఆరు వికెట్లను కోల్పోయి 9 పరుగులు మాత్రమే చేసింది. అందులోనూ జట్టు స్కోరు 180 పరుగుల వద్ద నాలుగు వికెట్లను చేజార్చుకోవడం గమనార్హం. 

అదరగొట్టిన షమీ, హర్షల్‌

భారత బౌలర్లు మొదట్లో పరుగులు ధారాళంగా ఇచ్చారు. ఫించ్‌తోపాటు మార్ష్, మ్యాక్స్‌వెల్‌ సులువుగానే పరుగులు రాబట్టారు. దీంతో 18 ఓవర్లకు 171/5 స్కోరుతో ఆసీస్‌ నిలిచింది. అయితే ఇక్కడే అసలైన డ్రామా మొదలైంది. టీమ్‌ఇండియా బౌలర్లకు ఫోబియా అయిన 19వ ఓవర్‌ను ఈసారి మాత్రం హర్షల్‌ పటేల్ అద్భుతంగా సంధించాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చి కీలకమైన ఫించ్‌ వికెట్‌ తీశాడు. విరాట్ కోహ్లీ చేసిన సూపర్ త్రో దెబ్బకు టిమ్‌ డేవిడ్‌ (5) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో చివరి ఓవర్‌లో 11 అవసరం కాగా.. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన షమీ అత్యుత్తమంగా వేశాడు. తొలి రెండు బంతులకు డబుల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బంతికి కమిన్స్‌ (4) ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో అద్భుతంగా ఒడిసిపట్టాడు. అనంతరం జోష్ ఇంగ్లిస్‌, కేన్ రిచర్డ్‌సన్‌ను షమీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆసీస్‌ 180 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ 3, భువనేశ్వర్‌ 2.. అర్ష్‌దీప్, హర్షల్‌ పటేల్, చాహల్ ఒక్కో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని