‘పింక్‌’ మాయాజాలం: తొలిరోజు టీమ్‌ఇండియాదే

మొతెరాలో టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. గులాబి బంతితో మాయ చేసింది. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో అదరగొట్టింది. డే/నైట్‌ టెస్టు తొలిరోజే మ్యాచ్‌పై పట్టు బిగించేసింది. ఇంగ్లాండ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. మధ్యాహ్నం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆంగ్లేయులను అక్షర్‌ (6/38), అశ్విన్‌ (3/26)....

Updated : 25 Feb 2021 00:24 IST

బంతితో అక్షర్‌.. బ్యాటుతో రోహిత్‌ మెరుపులు

(Images:BCCI)

అహ్మదాబాద్‌: మొతెరాలో టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. గులాబి బంతితో మాయ చేసింది. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో అదరగొట్టింది. డే/నైట్‌ టెస్టు తొలిరోజే మ్యాచ్‌పై పట్టు బిగించేసింది. ఇంగ్లాండ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. మధ్యాహ్నం బ్యాటింగ్‌ ఆరంభించిన ఆంగ్లేయులను అక్షర్‌ (6/38), అశ్విన్‌ (3/26) సాయంత్రానికే ఆలౌట్‌ చేశారు. ఇక రాత్రయ్యే సరికి ప్రత్యర్థి జట్టు స్కోరు 112కు బదులుగా రోహిత్‌ శర్మ (57 బ్యాటింగ్‌; 82 బంతుల్లో 9×4), విరాట్‌ కోహ్లీ (27; 58 బంతుల్లో 3×4) జట్టును 99/3తో నిలిపారు. అజింక్య రహానె (1 బ్యాటింగ్‌; 3 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు. ఇక రెండో రోజు కోహ్లీసేనలో ఏ ఇద్దరు నిలిచినా మ్యాచ్‌ ఏకపక్షం కావడం ఖాయం!

సొగసరి ‘హిట్‌’మ్యాన్‌
 ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభమే అందించారు. మనోహరమైన మొతెరాలో రోహిత్‌ శర్మ చూడచక్కని షాట్లతో అలరించాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌, అండర్సన్‌ కట్టుదిట్టంగా విసిరిన బంతుల్ని సమయోచితంగా అడ్డుకున్నాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (11; 51 బంతుల్లో 2×4) ఫర్వాలేదనిపించాడు. అయితే జట్టు స్కోరు 33 వద్ద అతడిని ఆర్చర్‌ ఔట్‌ చేశాడు. షార్ట్‌పిచ్‌లో విసిరిన బంతిని పుల్‌ చేయిబోయిన గిల్‌.. క్రాలీకి క్యాచ్‌ ఇచ్చాడు. మరో పరుగు వ్యవధిలోనే చెతేశ్వర్‌ పుజారా (0; 4 బంతుల్లో) అనూహ్యంగా లీచ్‌ బౌలింగ్‌లో డకౌట్‌ కావడం షాకిచ్చింది.

ఈ క్రమంలో విరాట్‌తో కలిసిన హిట్‌మ్యాన్‌ అద్భుతంగా ఆడాడు. అందివచ్చిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించాడు. సొగసైన పుల్‌, కవర్‌ షాట్లతో అలరించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇక తొలిరోజు విజయవంతంగా ముగిసిందని భావించేలోగా ఆఖరి ఓవర్‌ రెండో బంతికి కోహ్లీని లీచ్‌ పెవిలియన్‌ పంపించాడు. అప్పటికి స్కోరు 98. క్రీజులోకి వచ్చిన అజింక్య రహానె మిగిలిన బంతుల్ని ఆడి పరుగు తీసి భారత్‌ను 99/3తో నిలిపాడు. కోహ్లీసేన ఇంకా 13 పరుగుల లోటుతో ఉంది.

తిప్పేసిన అక్షర్‌, యాష్‌

అంతకు ముందు టాస్‌ గెలిచి తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ను అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ భారీ దెబ్బకొట్టారు. తొలిరోజు నుంచే స్పిన్‌ను అనుకూలించిన పిచ్‌ను ఉపయోగించుకొని ప్రత్యర్థిని విలవిల్లాడించారు. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ జట్టు స్కోరు రెండు పరుగుల వద్దే ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ డామ్‌ సిబ్లి (0)ని పెవిలియన్‌ పంపించి టీమ్‌ఇండియాకు శుభారంభం అందించాడు. ఇది లంబూ కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. వేగంగా ఆడుతున్న మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (53; 84 బంతుల్లో 10×4)కి అండగా నిలిచిన జానీ బెయిర్‌స్టోను అక్షర్‌ పటేల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో వికెట్‌ పడగొట్టాడు. అయితే కెప్టెన్‌ జో రూట్‌ (17; 37 బంతుల్లో)తో కలిసి క్రాలీ మూడో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఇంగ్లాండ్‌ విలవిల

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు నిలదొక్కుకుంటున్న సమయంలో అశ్విన్‌ తెలివైన ఎత్తుగడతో జోరూట్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఫుల్లర్‌ లెంగ్త్‌ బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. రూట్‌ సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు స్కోరు 74/3. మరికాసేపటికే అర్ధశతక వీరుడు జాక్‌ క్రాలీని అక్షర్‌ పటేల్‌ బోల్తా కొట్టించడంతో ఇంగ్లాండ్‌ 81/4తో భోజన విరామానికి వెళ్లింది. ఆ తర్వాత అక్షర్‌ అద్భుతం చేశాడు. సొంతమైదానంలో ఆడుతున్న అతడు తన అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. భిన్నమైన కోణాల్లో బంతులు విసురుతూ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీశాడు. బెన్‌స్టోక్స్‌ (6), బెన్‌ఫోక్స్‌ (12), జోఫ్రా ఆర్చర్‌ (11), స్టువర్ట్‌ బ్రాడ్‌ (3)ను పెవిలియన్‌కు పంపించి వరుసగా రెండో టెస్టులో ‘5+’ వికెట్ల ఘనత అందుకున్నాడు. అతడి ధాటికి ఆంగ్లేయులు వందలోపే చాపచుట్టేస్తారనిపించింది. మరోవైపు ఒలీ పోప్‌ (1), జాక్‌లీచ్‌ (3)ను యాష్‌ ఔట్‌ చేశాడు. తొలిరోజే తమకు అనుకూలించిన పిచ్‌ను ఉపయోగించుకొన్న స్పిన్నర్లు 9 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 112కు పరిమితం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని