Chennai : ఈ క్రికెటర్లు ఇలా కనిపించి.. అలా వెళ్లిపోయారు!

ముంబయి అనగానే రోహిత్‌ శర్మ, పొలార్డ్.. బెంగళూరు అనగానే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌.. చెన్నై అనగానే ఎం.ఎస్‌.ధోనీ, సురేశ్ రైనా.. పేర్లు ఠక్కున గుర్తుకొస్తాయి కదూ. అవును..ఈ ఆటగాళ్లు చాలాకాలంగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం

Updated : 29 Mar 2022 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి అనగానే రోహిత్‌ శర్మ, పొలార్డ్.. బెంగళూరు అనగానే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌.. చెన్నై అనగానే ఎం.ఎస్‌.ధోనీ, సురేశ్ రైనా.. ఈ పేర్లే మనకు గుర్తుకొస్తాయి కదూ. అవును..ఈ ఆటగాళ్లు చాలాకాలంగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తూ కీలక ఆటగాళ్లుగా అవతరించారు. అయితే, మెగా టోర్నీలో కొంతమంది ఆటగాళ్లు.. ఇలా కనిపించి అలా మాయమైన వాళ్లూ ఉన్నారు. చెన్నై జట్టు తరఫున ఒకే మ్యాచ్‌ ఆడి.. ఆ తర్వాత కాంట్రాక్టు కోల్పోయిన ఆటగాళ్లను ఓసారి చూస్తే.. 

తనదైన ‘మార్క్‌’ చూపించలేకపోయాడు

మార్క్‌ వుడ్.. ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలర్‌. 2018లో జరిగిన వేలంలో చెన్నై ఈ ఆటగాడిని రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. అదే సీజన్‌లో ముంబయితో జరిగిన లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో వుడ్‌కి తుది జట్టులో చోటు దక్కినా.. తనదైన ‘మార్క్‌’చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి.. ఒక్క వికెట్‌కు కూడా పడగొట్టకుండా 49 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో తర్వాత మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే,  కౌంటీ మ్యాచ్‌లు ఆడేందుకు సీజన్‌ మధ్యలోనే ఇంగ్లాండ్‌ వెళ్లిపోయాడు. 2019 వేలానికి ముందు చెన్నై.. మార్క్‌వుడ్‌ని జట్టు నుంచి విడుదల చేసింది. అప్పటి నుంచి అతడ్ని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు.


ఒక్క ఛాన్స్‌ కోసం మూడేళ్లు..

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జాన్‌ హేస్టింగ్స్‌ను 2011లో కొచ్చి టస్కర్స్‌ దక్కించుకుంది. కానీ, ఈ ఆటగాడికి మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడటానికి మూడేళ్లు పట్టింది. హేస్టింగ్స్‌ని 2014లో చెన్నై కొనుగోలు చేసి ఇదే సీజన్‌లో రాంచీ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తుదిజట్టులోకి  తీసుకుంది. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన జాన్‌.. 29 పరుగులు ఇచ్చి కీలకమైన డేవిడ్‌ వార్నర్‌ వికెట్‌ని పడగొట్టాడు. ఇది అంత చెత్త ప్రదర్శన కాకపోయినా.. చెన్నై అతడికి తర్వాత మ్యాచ్‌ల్లో ఎందుకోగాని అవకాశం కల్పించలేదు. కొన్ని రోజులకే ఆ జట్టుతో కాంట్రాక్టును కోల్పోయాడు.


ఒక్క ఓవర్‌.. 19 పరుగులు 

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌.. 2014లో చెన్నై తరఫున రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. విజయ్‌ శంకర్‌ ఒక్కటే ఓవర్‌ బౌలింగ్‌ చేసి 19 పరుగులు సమర్పించుకుని పూర్తిగా నిరాశపర్చాడు. బ్యాటింగ్‌ చేసే అవకాశం కూడా రాలేదు.  తర్వాత మ్యాచ్‌ల్లో తుది జట్టులోకి తీసుకోలేదు. 2015 సీజన్‌ ప్రారంభానికి ముందే చెన్నై అతణ్ని వదులుకుంది.


44 మ్యాచ్‌లు బెంచ్‌కే పరిమితం..

దేశవాళీ క్రికెటర్‌ మోను కుమార్‌ 2018లో చెన్నై జట్టులో  చేరాడు. 44 మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. చివరకు 2020లో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన మోను కుమార్‌..20 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు. 2021 సీజన్‌కు ఈ ఆటగాడిని చెన్నై వదులుకుంది.


పెరీరా.. పరిస్థితి అంతే..

శ్రీలంక ఆల్‌రౌండర్‌ తిసార పెరీరా.. 2010లో చెన్నై తరఫున ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో పెరీరాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఒక్క ఓవర్‌ బౌలింగ్‌ చేసి 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత పెరీరా చెన్నై తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. 2011 ఐపీఎల్ వేలానికి ముందు ఈ ఆటగాడిని చెన్నై వదులుకుంది. ఆ తర్వాత పెరీరా చాలా ఫ్రాంచైజీల తరఫున ఆడాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు