MI vs PBKS: ముంబయి ఇండియన్స్‌కు షాకిచ్చిన పంజాబ్ కింగ్స్‌..

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది నాలుగో విజయంపై కన్నేసిన ముంబయి ఇండియన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ షాక్‌ ఇచ్చింది. పంజాబ్‌ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 22 Apr 2023 23:53 IST

ముంబయి: వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది నాలుగో విజయంపై కన్నేసిన ముంబయి ఇండియన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ షాక్‌ ఇచ్చింది. పంజాబ్‌ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబయి బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (57; 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కామెరూన్‌ గ్రీన్ (67; 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (44; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (4/29) ఆకట్టుకోగా.. నాథన్‌ ఎల్లిస్‌, లివింగ్ స్టోన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

ముంబయి విజయానికి చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు అవసరం కాగా.. సూర్యకుమార్‌ యాదవ్, టిమ్ డేవిడ్ (25*; 13 బంతుల్లో) క్రీజులో ఉండటంతో ముంబయి విజయం సాధించేలా కనిపించింది. కానీ, 18 ఓవర్‌లో అర్ష్‌దీప్‌ సూర్యకుమార్‌ని ఔట్‌ చేసి ముంబయికి షాకిచ్చాడు. తర్వాతి ఓవర్‌లో 15 పరుగులు రాగా.. చివరి ఓవర్‌లో ముంబయి విజయానికి 16 పరుగులు అవసరం అయ్యాయి. ఆఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్‌ మొదటి రెండు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చాడు. తర్వాత వరుస బంతుల్లో తిలక్‌ వర్మ (3), నేహల్‌ వధేరా (0)లను క్లీన్‌బౌల్డ్ చేయడంతో ముంబయి ఓటమి ఖాయమైంది. ఈ రెండు వికెట్లకు మిడిల్ స్టంప్ విరిగిపోవడం విశేషం. 

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సామ్ కరన్ (55; 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), హర్‌ప్రీత్‌ సింగ్ భాటియా (41; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. చివర్లో జితేశ్‌ శర్మ (25; 7 బంతుల్లో 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్ (26), అథర్వ తైడే (29) ఫర్వాలేదనిపించారు. చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు 96 పరుగులు రాబట్టారు. ముంబయి బౌలర్లలో కామెరూన్ గ్రీన్‌, పీయూష్‌ చావ్లా రెండేసి వికెట్లు పడగొట్టగా.. అర్జున్ తెందూల్కర్, బెరెన్‌డార్ప్‌, జోఫ్రా ఆర్చర్ ఒక్కో వికెట్ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని