Ishan - Dhoni: అక్కడ మహీభాయ్‌ ఆటోగ్రాఫ్ ఉంది.. నేను సంతకం పెట్టలేను: ఇషాన్‌ కిషన్

బ్యాట్‌తోనే కాదు తన ప్రవర్తనతో టీమ్‌ఇండియా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకొన్నాడు యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌. ప్రస్తుతం అతడు ఝార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు.

Updated : 20 Dec 2022 18:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో అద్భుతంగా డబుల్‌ సెంచరీ సాధించి రికార్డు సృష్టించిన ఝార్ఖండ్‌ డైనమైట్ ఇషాన్‌ కిషన్‌ తాజాగా నెటిజన్ల మనస్సును మరోసారి కొల్లగొట్టాడు. అయితే ఇదేమీ మైదానంలో ఆటగాడిగా కాదు సుమా.. ఆఫ్ ఫీల్డ్‌లో అభిమానులతో జరిగిన సంభాషణ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఇషాన్‌ చేసిందేమిటో తెలుసుకోండి.. 

ఎంఎస్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మరి అదే రాష్ట్రం నుంచి (ఝార్ఖండ్‌) వచ్చిన యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్ ఫ్యాన్‌ కాకుండా ఉంటాడా..? అందులోనూ ఇద్దరూ వికెట్‌ కీపింగ్‌ బ్యాటర్లే కావడం విశేషం. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ అనంతరం స్వదేశానికి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో అభిమానులతో కలిసి ఫొటోషూట్, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ బిజీగా గడిపాడు. 

ఇలా చేస్తుండగా.. ఓ అభిమాని తన సెల్‌ఫోన్‌ వెనుక భాగంలో ఆటోగ్రాఫ్‌ చేయాలని ఇషాన్‌ను కోరాడు. ఇక్కడే అసలైన కథ మొదలైంది. సరే చేద్దామని తీసుకొన్న ఇషాన్‌.. నేను చేయలేనంటూ బదులిచ్చాడు. అక్కడున్నవారంతా కాస్త అయోమయానికి గురయ్యారు. ఇంతలో ఇషాన్‌ మాట్లాడుతూ.. ఇక్కడ మహీ భాయ్‌ (మహేంద్ర సింగ్ ధోనీ) సంతకం ఉంది. నువ్వు దాని మీద ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగావు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే నేను ఎంఎస్ ధోనీ స్థాయికి చేరుకోలేదు. కాబట్టి ధోనీ భాయ్‌ ఆటోగ్రాఫ్‌కి కిందివైపున నేను సంతకం పెడతా.’’ అని ఇషాన్‌ చెప్పాడు. ధోనీ ఆటోగ్రాఫ్ కిందనే సంతకం చేసి సదరు అభిమానికి ఇచ్చాడు. ఈ వీడియోను ఓ అభిమాని యూట్యూబ్‌లో షేర్‌ చేశాడు.

భారత టీ20 లీగ్‌ గత సీజన్‌లో నిర్వహించిన మెగా వేలంలో అత్యంత భారీ ధరను దక్కించుకొన్న ఇషాన్‌ కిషన్‌.. ముంబయి తరఫున ఆ సీజన్‌లో పెద్దగా రాణించలేదు. కానీ భారత్‌ తరఫున వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజేతులా అందిపుచ్చుకొనేందుకు సిద్ధంగా ఉంటాడు. అలాగే బంగ్లాపై వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకొని ఏకంగా డబుల్‌ సెంచరీ బాదేశాడు. దీంతో వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ జట్టులో స్థానం కోసం బరిలో నిలిచాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని