Ravi Shastri: వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియాకు అతడే కెప్టెన్‌! : రవిశాస్త్రి

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) గురించి మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Updated : 25 Jun 2023 13:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్‌ (IND vs WI) పర్యటనకు సిద్ధమైంది. దీంతో టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) గురించి మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పాండ్యను టెస్టు క్రికెట్‌లో తిరిగి చూడలేకపోతున్నామని.. వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత అతడు వైట్‌ బాల్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా మారే అవకాశం ఉందని శాస్త్రి చెప్పాడు. ‘హార్దిక్‌ శరీరం టెస్టు క్రికెట్‌ను ఎదుర్కోలేకపోతోంది. ప్రపంచకప్‌ తర్వాత.. అతడు వైట్‌ బాల్‌ క్రికెట్‌ కెప్టెన్సీ చేపట్టాలని నేను భావిస్తున్నాను. వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి రోహితే సారథి. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని శాస్త్రి స్పష్టం చేశాడు. ఇక హార్దిక్‌ను విండీస్‌తో వన్డేలకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

బుమ్రా విషయంలో తొందరొద్దు..

టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా (Jasprit Bumrah) గాయం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని జట్టులోకి తీసుకొచ్చేందుకు తొందరపడొద్దని సెలెక్టర్లను రవిశాస్త్రి హెచ్చరించాడు. గాయం కారణంగా బుమ్రా గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌, ఐపీఎల్‌, WTC Final 2023లకు అతడు దూరమయ్యాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం అతడిని జట్టులోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు.. జట్టుతోపాటు అతడికి చెడుగా మారే అవకాశం ఉందని రవిశాస్త్రి ఓ ఛానల్‌తో పేర్కొన్నాడు. ‘అతడు ఎంతో కీలకమైన బౌలర్‌.  ప్రపంచకప్‌ కోసం అతడిని తొందరపెడితే.. షాహిన్‌ అఫ్రిదీ మాదిరిగా నాలుగు నెలల అనంతరం అతడి సేవలను కోల్పేయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని శాస్త్రి సూచించాడు.

అంతకంటే ఎక్కువ అవసరం లేదు..

ఇక ఇటీవల టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ గురించి మాజీ స్పిన్నర్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) చేసిన కామెంట్లపై కూడా రవిశాస్త్రి స్పందించాడు. ‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా ఉండేవారు.. ఇప్పుడైతే కొలీగ్స్ మాత్రమే. రెండింటి మధ్య చాలా తేడా ఉంది’ అంటూ అశ్విన్‌ ఇటీవల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. వీటిపై శాస్త్రి స్పందిస్తూ..‘నాకైతే వారు ఎల్లప్పుడూ సహచరులే. మీకు సహచరులుగా ఉండే స్నేహితులు ఉంటారు. ఎంత మంది క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు..? అని ఎవరినైనా అడిగితే.. నలుగురు లేదా ఐదుగురు అని చెప్తారు. నాకు ఐదుగురు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. అంతకంటే ఎక్కువ నాకు అవసరం లేదు’ అని శాస్త్రి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని