టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ జెర్సీ ఇదే

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్‌ 2న ఆరంభం కానుంది.

Published : 07 May 2024 01:49 IST

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్‌ 2న ఆరంభం కానుంది.


టీ20 ప్రపంచకప్‌కు ఉగ్ర ముప్పు!

పోర్టాఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌, అమెరికా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ట్రినిడాడ్‌ ప్రధాన మంత్రి కీత్‌ రోలీ చెప్పారు. అయితే జూన్‌ 2న ఆరంభమయ్యే ఈ టోర్నమెంట్‌కు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఐసీసీ పేర్కొంది. భారత్‌ సహా 20 జట్లు పోటీపడే ప్రపంచకప్‌ తొమ్మిది వేదికల్లో జరగనుంది. ఆరు వేదికలు వెస్టిండీస్‌లో, మూడు వేదికలు అమెరికాలో ఉన్నాయి. బెదిరింపులు ఏ సంస్థ నుంచి వచ్చాయన్నది రోలీ వెల్లడించలేదు. ఇస్లామిక్‌ స్టేట్‌ బెదిరింపులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ఐసీసీ స్పందించింది. టోర్నీ భద్రతకు హమీనిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘ఈ టోర్నీలో ప్రతి ఒక్కరి భద్రతే మాకు అన్నింటికన్నా ముఖ్యం. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాం. ఆతిథ్య దేశాల అధికారులతో కలిసి పనిచేస్తున్నాం’’ అని పేర్కొంది.


బంగ్లాతో నాలుగో టీ20 భారత్‌దే

సిల్‌హెట్‌: భారత మహిళల జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ను నాలుగో టీ20లోనూ ఓడించి అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 ఆధిక్యం సంపాదించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో 56 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం వల్ల ఇన్నింగ్స్‌ను 14 ఓవర్లకు కుదించగా.. మొదట భారత్‌  6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (39; 26 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. రిచా ఘోష్‌ (24; 15 బంతుల్లో 3×4, 1×6) రాణించింది. లక్ష్యాన్ని 125 పరుగులకు సవరించగా.. బంగ్లా 7 వికెట్లకు 68 పరుగులే చేయగలిగింది. దీప్తి శర్మ (2/13), ఆషా శోభన (2/18) ఆ జట్టును దెబ్బతీశారు.


ప్రపంచ నం.2కు మనిక షాక్‌

కేఏఈసీ (సౌదీ అరేబియా): సౌదీ స్మాష్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ మనిక బత్రా సంచలన విజయం సాధించింది. సోమవారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో మనిక 6-11, 11-5, 11-7, 12-10తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ మన్‌యూ (చైనా)కు షాక్‌ ఇచ్చి ప్రిక్వార్టర్స్‌ చేరింది. మరోవైపు ఆకుల శ్రీజ 7-11, 11-3, 11-9, 12-14తో జెనీ సహో (పోర్చుగల్‌) చేతిలో ఓడింది.


భారత్‌ పసిడి పాంచ్‌

అస్తానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ బాక్సర్లు అయిదు స్వర్ణాలు సాధించారు. బ్రిజేశ్‌ (48 కేజీలు), ఆర్యన్‌ హుడా (51 కేజీలు), యశ్‌వర్దన్‌ (63.5 కేజీలు), లక్ష్మీ (50 కేజీలు), నిషా (52 కేజీలు) ఫైనల్లో విజయాలు నమోదు చేశారు.


గంభీర్‌ కోరుకున్నట్లు..

లఖ్‌నవూ: మెంటర్‌ గౌతమ్‌ గంభీర్‌ గెలుపు నమూనాను అనుసరించడం వల్ల కోల్‌కతా మంచి ఫలితాలు రాబడుతోందని ఆ జట్టు యువ పేసర్‌ హర్షిత్‌ రాణా అన్నాడు. ఈ సీజన్‌లో అదరగొడుతోన్న కోల్‌కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. గంభీర్‌ నాయకత్వం (2011-2017)లో నైట్‌రైడర్స్‌ రెండు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచింది. మొత్తం అయిదుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కానీ గత ఏడేళ్లలో రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టగలిగింది. ఈ ఏడాది మెంటర్‌గా గంభీర్‌ కోల్‌కతాకు తిరిగి రావడంతో ఆ జట్టు దూసుకుపోతోంది. ఆదివారం లఖ్‌నవూపై 98 పరుగుల విజయంతో 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. ‘‘ఈ మ్యాచ్‌లోనే కాదు.. ఈ సీజనంతా గౌతమ్‌ గంభీర్‌ కోరుకున్నట్లుగా ఆడుతున్నాం. మ్యాచ్‌లను ఎలా మనవైపు తిప్పుకోవాలనే విషయంలో అతడికి చాలా పరిజ్ఞానం ఉంది. అది మాకు ఎంతో ఉపయోగపడుతోంది. కేకేఆర్‌ పిచ్‌ను బాగా అర్థం చేసుకుంటుంది. మేం సరైన ప్రాంతాల్లో బంతులేశాం’’ అని మ్యాచ్‌ అనంతరం రాణా వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు