ఇది హైబ్రిడ్‌ రకం!

హైబ్రిడ్‌ కూరగాయలు, హైబ్రిడ్‌ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్‌ పిచ్‌’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్‌లో హైబ్రిడ్‌ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం.

Published : 07 May 2024 01:52 IST

ధర్మశాల: హైబ్రిడ్‌ కూరగాయలు, హైబ్రిడ్‌ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్‌ పిచ్‌’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్‌లో హైబ్రిడ్‌ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ హైబ్రిడ్‌ పిచ్‌ ఇప్పుడు భారత్‌లో కూడా అడుగు పెట్టేసింది. ఐసీసీ అనుమతి కూడా పొందిన ఈ పిచ్‌ను ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో అందుబాటులోకి తెచ్చారు. ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌తో పాటు ఈ పిచ్‌ను రూపొందించిన ఎస్‌ఐఎస్‌గ్రాస్‌ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ పాల్‌ టేలర్‌ సమక్షంలో పిచ్‌ను ఆవిష్కరించారు. సంప్రదాయ పిచ్‌లతో పోలిస్తే దీని తయారీ కొంచెం భిన్నం. గడ్డి, పచ్చికతో పాటు 5 శాతం మేర సింథటిక్‌ కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల పిచ్‌ ఎక్కువ సమయంలో తాజాగా ఉండి మన్నిక పెరుగుతుంది. నేల ఎలాంటిదైనా పిచ్‌ మాత్రం ఒకేలా ఉండడం దీని ప్రత్యేకత. తయారీ భిన్నమే అయినా.. సంప్రదాయ పిచ్‌ల తరహాలో సహజంగానే స్పందిస్తుందని పాల్‌ టేలర్‌ చెబుతున్నాడు. మామూలు పిచ్‌లతో పోలిస్తే మూడు రెట్లు మన్నిక ఎక్కువ. కాబట్టి పిచ్‌ల నిర్వహణలో మైదాన సిబ్బందిపై భారం బాగా తగ్గుతుంది. సంప్రదాయ పిచ్‌ల తరహాలోనే మ్యాచ్‌ అవసరాలకు తగ్గట్లుగా పిచ్‌ను మార్చుకోవచ్చు. స్పిన్‌ పిచ్‌ కావాలంటే గడ్డి తగ్గించడం.. పేసర్లకు అనుకూలించాలంటే గడ్డి పెంచడం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఐసీసీ వన్డేలు, టీ20ల్లోనే ఈ పిచ్‌లను ఉపయోగించేందుకు అనుమతించింది. భవిష్యత్తులో టెస్టులకూ వీటిని వినియోగించవచ్చు. ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌, ఓవల్‌ మైదానాల్లో హైబ్రిడ్‌ పిచ్‌లను ఏర్పాటు చేయడం విశేషం. అక్కడ కౌంటీ క్రికెట్లో కూడా ఈ పిచ్‌ల మీద మ్యాచ్‌లు ఆడిస్తున్నారు. అయితే ధర్మశాలలో ఇప్పుడు ఏర్పాటు చేసింది ప్రయోగాత్మక పిచ్‌యే. దాని మీద ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మాత్రమే చేస్తారు. మ్యాచ్‌ల్లో వీటి వినియోగం ఇప్పుడే ఉండదు. ప్రాక్టీస్‌లో పిచ్‌ స్పందించే తీరు, మన్నికను బట్టి భవిష్యత్తులో వీటిపై మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని