‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే పోటీలు. ఒలింపిక్స్‌లో అర్హత సాధించడానికి భారత్‌కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్‌కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్‌లో బ్యాటన్‌ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది.

Updated : 07 May 2024 04:12 IST

రిలేలో ఒలింపిక్స్‌కు భారత మహిళల బృందం
పురుషుల రిలే జట్టు కూడా
నాసు (బహమాస్‌)

ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే పోటీలు. ఒలింపిక్స్‌లో అర్హత సాధించడానికి భారత్‌కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్‌కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్‌లో బ్యాటన్‌ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. చిరుత వేగంతో పరుగెత్తి భారత్‌ను రేసులో నిలిపింది.  జ్యోతిక అందించిన ఆధిక్యాన్ని పూవమ్మ, శుభ కొనసాగించడంతో రాణించడంతో 4×400 మీటర్ల రిలేలో భారత్‌ ద్వితీయ స్థానంతో రేసును పూర్తి చేసి ఒలింపిక్స్‌ బెర్తు పట్టేసింది. పురుషుల విభాగంలోనూ భారత్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం.

నాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్‌ దండి జ్యోతికశ్రీ సత్తా చాటింది. మహిళల 4×400 మీటర్ల రిలేలో అదరగొట్టి జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు తోడ్పడింది. సోమవారం బహమాస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే రెండో అర్హత టోర్నీలో జ్యోతికశ్రీ, రూపల్‌ చౌదరి, పూవమ్మ, శుభ వెంకటేశన్‌లతో కూడిన బృందం హీట్‌-1లో 3 నిమిషాల 29.35 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. జమైకా (3 నిమిషాల 28.54 సె) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హీట్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే పారిస్‌ బెర్తు దక్కించుకునే నేపథ్యంలో రేసు ఉత్కంఠభరితంగా  ఆరంభమైంది. తొలి 400 మీటర్లలో భారత్‌ అమ్మాయి రూపల్‌ ప్రత్యర్థులతో సరితూగలేకపోయింది. అయిదో స్థానానికి పరిమితమై బ్యాటన్‌ను జ్యోతికి అందించింది. శక్తినంతా కూడదీసుకుంటూ తెలుగమ్మాయి దూసుకెళ్లింది. తడబాటు లేకుండా లెగ్‌ను రెండో స్థానంతో ముగించి బ్యాటన్‌ను పూవమ్మకు అందించింది. జ్యోతి ఇచ్చిన స్ఫూర్తితో మొదట పూవమ్మ.. ఆఖరి లెగ్‌లో శుభ మెరుపులా దూసుకెళ్లడంతో భారత్‌ రెండో స్థానంతో రేసు ముగించింది. దీంతో పారిస్‌ టికెట్‌ సొంతమైంది. తొలి క్వాలిఫయింగ్‌ ఈవెంట్లో హీట్‌లో అయిదో స్థానంలో నిలిచిన భారత్‌.. రెండో ఈవెంట్లో శక్తికి మించి పోరాడి.. ఐరోపా అథ్లెట్ల పోటీని తట్టుకుని ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తీరు స్ఫూర్తిదాయకం. రియో ఒలింపిక్స్‌ తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌లో అమ్మాయిల బృందం బరిలో దిగబోతోంది. మొత్తంగా 1984 నుంచి 4×400 మీటర్ల రిలేలో భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది ఎనిమిదోసారి. పారిస్‌కు వెళ్లబోయే రిలే జట్టును భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య తర్వాత ప్రకటిస్తుంది.

పురుషుల జట్టు మెరుపులా..: భారత పురుషుల రిలే జట్టు కూడా పారిస్‌ విమానం ఎక్కబోతోంది. 4×400 మీటర్ల పరుగులో మహ్మద్‌ అనాస్‌, మహ్మద్‌ అజ్మల్‌, రాజీవ్‌ అరోకియా, అజ్మల్‌ జాకబ్‌లతో కూడిన జట్టు 3 నిమిషాల 3.23 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్‌-1లో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా (2 నిమిషాల 59.95 సెకన్లు) అగ్రస్థానం సాధించింది. ఈ ఈవెంట్లో ఒలింపిక్స్‌లో పోటీపడడం పురుషుల జట్టుకు ఇది నాలుగోసారి. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తొలిసారి బరిలో దిగింది. 4×400 మీ. రిలేలో పురుషులు, మహిళల జట్లు అర్హత సాధించడంతో పారిస్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పోటీపడే భారత అథ్లెట్ల సంఖ్య 19కి చేరింది.

‘‘ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం పెద్ద ఘనత. తొలి అంచె ఈవెంట్లో ఓడినా.. రెండో అంచెలో కచ్చితంగా గెలుస్తామని మా జట్టు నమ్మింది. మొదట లెగ్‌లో రూపల్‌ వెనుకబడినప్పుడు.. రెండో లెగ్‌లో పరుగెత్తిన నాకు కాస్త ఒత్తిడిగా అనిపించింది. కానీ సవాల్‌గా తీసుకున్నా. ఈ రేసు ఒలింపిక్స్‌కు చివరి అవకాశం కావడంతో.. పట్టుదలగా వేగంగా పరుగెత్తాను. జమైకా అథ్లెట్‌ను అధిగమించాలనుకున్నా కానీ కుదర్లేదు. మా జట్టులోని మిగతా సభ్యులూ రాణించడంతో జట్టు ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. అక్కడ పోటీ చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఆఖరిదాకా పోరాడతాం’’

‘ఈనాడు’తో జ్యోతి


తెలుగు మెరుపు

4×400 మీటర్ల పరుగులో భారత మహిళల జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌కు బెర్తు సాధించడంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీది పశ్చిమగోదావరి జిల్లా తణుకు. ఛాంపియన్‌ అథ్లెట్‌ కావాలన్నదే ఆమె చిన్ననాటి లక్ష్యం. నాన్న దండి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో రన్నర్‌గా ఎదిగిన 23 ఏళ్ల జ్యోతి.. 400 మీటర్ల పరుగులో సత్తా చాటుతోంది. ఇంట్లో ఇద్దరు అమ్మాయిల్లో చిన్నదైన ఆమె.. చిన్నప్పుడు ఒక పరుగు పందెం చూసి స్ఫూర్తి పొందింది. తాను అథ్లెట్‌ కావాలని భావించింది. స్వతహాగా క్రీడాకారుడే అయిన నాన్న కూడా అండగా నిలవడంతో జ్యోతి కెరీర్‌కు పునాది పడింది. 2016-2020 వరకు సాయ్‌ కోచ్‌ వినాయక్‌ ప్రసాద్‌ శిక్షణలో ఆమె పరుగుపై పట్టు సంపాదించింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో గోపీచంద్‌ మైత్రా అథ్లెటిక్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా కోచ్‌ నాగపురి రమేశ్‌ దగ్గర శిక్షణ పొంది రాటుదేలింది.

‘ఈనాడు’ లక్ష్య సాయంతో..: 2017 ప్రపంచ యూత్‌ అథ్లెటిక్స్‌ రిలే టోర్నీలో 4×400 మీ పరుగులో పాల్గొన్న ఈ తెలుగమ్మాయి.. 2021లో అండర్‌-23 మహిళల 400 మీ. పరుగులో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. 2022 జాతీయ క్రీడల్లోనూ రజతం సాధించింది. గతేడాది నుంచి ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ తోడ్పాటుతో మరింత మెరుగైన అథ్లెట్‌గా మారింది. ఉత్తమ శిక్షణ అందడంతో అత్యుత్తమ ఫలితాలు రాబడుతున్న జ్యోతి.. 2023 ఇండియన్‌ గ్రాండ్‌ప్రి 2, 4 అంచె టోర్నీల్లో స్వర్ణాలతో మెరిసింది. నిరుడు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 4×400 మీటర్ల పరుగులో కాంస్యం గెలవడంలో కీలకపాత్ర పోషించింది.  400 మీటర్ల పరుగులో జ్యోతి అత్యుత్తమ టైమింగ్‌ 53.05 సెకన్లు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల సమయంలో గాయం కావడంతో ఆమె పరుగుకు దూరమైంది. కోలుకుని పునరాగమనంలో రిలే టీమ్‌లో కీలక సభ్యురాలిగా ఎదిగింది. ‘‘2021 నుంచి జ్యోతికకు శిక్షణ ఇస్తున్నాం. గచ్చిబౌలిలోని గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందినప్పుడే ఆమె కెరీర్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌ సాధించింది. ఎక్కువ దూరం వేగంగా పరుగెత్తగలిగే సామర్థ్యం ఆమె సొంతం. అందుకే ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే ఈవెంట్లో భారత్‌ తొలి లెగ్‌లో వెనుకబడినా.. జ్యోతిక మళ్లీ ట్రాక్‌లో పెట్టగలిగింది. ఈనాడు సీఎస్‌ఆర్‌ లక్ష్య కార్యక్రమం ద్వారా ఎందరో జ్యోతిక లాంటి ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు’’ అని ఆమెకు శిక్షణ ఇచ్చిన సీనియర్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని