kL RAHUL: విండీస్‌తో టీ20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ దూరం

టీమ్‌ఇండియా వరుస సిరీస్‌లతో బిజీగా గడుపుతుంటే..స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం వివిధ కారణాలతో కీలక సిరీస్‌లకు దూరం అవుతున్నాడు.

Published : 28 Jul 2022 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా వరుస సిరీస్‌లతో బిజీగా గడుపుతుంటే.. స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం వివిధ కారణాలతో కీలక సిరీస్‌లకు దూరం అవుతున్నాడు. తాజాగా అందిన నివేదికలు ప్రకారం విండీస్‌తో టీ20 సిరీస్‌కు రాహుల్ ఉండడని, అతడికి బీసీసీఐ వైద్యబృందం వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.  భారత టీ20 లీగ్‌ అనంతరం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైనా కేఎల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడి ఆ సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తరవాత బీసీసీఐ వైద్య బృందం అతడి గాయం తీవ్రత పెరిగిందని చెప్పడంతో ఇంగ్లాండ్‌ పర్యటనకు రాహుల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. గత నెలలో వైద్యుల సూచన మేరకు  రాహుల్‌ జర్మనీలో హెర్నియా సర్జరీ చేయించుకొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్‌ చేసి త్వరలో మైదానంలో అడుగుపెడతానని చెప్పాడు. ఆ తరవాత బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ సాధించడం కోసం ప్రాక్టీస్‌ చేశాడు.

సెలెక్టర్లు విండీస్‌తో వన్డే సిరీస్‌కు అతడిని పరిగణనలోకి తీసుకోకపోయినా, టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. దీంతో ఇక్కడైనా రాహుల్ ఆట చూడొచ్చని అభిమానులు ఆశించారు. అయితే, ఈ నెల 21న రాహుల్‌కు కొవిడ్‌ సోకినట్లు బీసీసీఐ తెలియజేసింది. దీంతో అతడు ఐసోలేషన్‌ ఉండి కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే విండీస్‌తో టీ20 సిరీస్‌కు కొందరు ఆటగాళ్లు ట్రినిడాడ్‌ చేరుకొన్నారు. రాహుల్‌ మొదటి మూడు టీ20లకు అందుబాటులో లేకపోయినా, చివరి రెండు మ్యాచ్‌లకు జట్టుతో కలుస్తాడని భావించారు. అయితే, తాజాగా అందిన నివేదికల ప్రకారం రాహుల్‌ ఈ సిరీస్‌కు కూడా పూర్తిగా దూరమైనట్లు తెలిసింది. జింబాబ్వేతో ఆగస్టు 18న ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో  రాహుల్ పునరాగమనం చేసే అవకాశం ఉంది. రాహుల్ గైర్హాజరీలో రిషబ్ పంత్‌ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఓపెనింగ్‌ చేశాడు. విండీస్‌ సిరీస్‌లో పంత్‌ లేదా ఇషాన్‌ కిషన్‌లో ఒకరు రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తారు. అయితే, రాహుల్‌ ఆసియా కప్‌ నాటికి అందుబాటులోకి వస్తే ఓపెనర్‌గా ఎవరు వస్తారన్నదే ఆసక్తికరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని