FIFA: మెరిసిన మెస్సీ.. మురిసిన అర్జెంటీనా..!

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కళ్లుచెదిరే గోల్‌తో మెరిసిన లియోనల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా రికార్డును బద్దలుకొట్టాడు.

Updated : 04 Dec 2022 13:33 IST

ఖతార్‌: ఫిఫా ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో పరాజయం పాలైన అర్జెంటీనా ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. శనివారం రౌండ్‌-16లో ఆస్ట్రేలియాతో పోరులో 2-1 తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. తన 1000వ మ్యాచ్‌లో కళ్లు చెదిరే గోల్‌తో ఆకట్టుకున్న కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా రికార్డును బద్దలుకొట్టాడు. ఈ ప్రపంచకప్‌ రౌండ్‌-16(నాకౌట్‌దశ)లో చేసిన తొలి గోల్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మెస్సీ 3 గోల్స్‌ సాధించాడు. దీంతో అతడి కెరీర్‌లో ఫిఫా ప్రపంచకప్‌లలో కొట్టిన మొత్తం గోల్స్‌ సంఖ్య 9కి చేరింది. అర్జెంటీనా తరపున ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్లలో రెండో స్థానానికి చేరుకొన్నాడు. గతంలో ఈ స్థానంలో డీగో మారడోనా ఉండేవాడు. అర్జెంటీనా తరపున ఫీఫా కప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన వారిలో గాబ్రియెల్‌ బటిస్టుటా (10) తొలి స్థానంలో ఉన్నాడు. 

పోర్చుగల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(సీఆర్‌-7) కంటే మెస్సీ మెరుగైన రికార్డు సాధించాడు. వీరిద్దరిలో ఎవరు ఉత్తమ ఆటగాడు అనే చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. రొనాల్డో తన 1000వ అంతర్జాతీయ మ్యాచ్‌ను 2020లో పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతడు 725 గోల్స్ చేయగా మరో 216 గోల్స్‌ చేసేందుకు సహకరించాడు. ఇక మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌లో 1000వ మ్యాచ్‌ను తాజాగా ఆస్ట్రేలియాతో ఆడాడు. తన కెరీర్‌లో మొత్తం 789 గోల్స్‌ చేయగా.. 348 గోల్స్‌కు సహకారం అందించాడు. రొనాల్డో ఖాతాలో 31 ట్రోఫీలు .. మెస్సీ వద్ద 41 ఉన్నాయి. రికార్డుల పరంగా మెస్సీ చాలా మెరుగ్గా ఉన్నట్లే లెక్క. తాజా గెలుపుతో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్న అర్జెంటీనా తన తదుపరి పోరులో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని