మిథాలి రాజ్‌ రిటైర్మెంట్‌పై నిర్ణయం..

వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్పే తన చివరి సిరీస్‌ అని టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌ మిథాలి రాజ్‌ పేర్కొన్నారు. ‘1971 ది బిగినింగ్‌ ఆఫ్‌ ఇండియా క్రికెటింగ్‌ గ్రేట్‌నెస్‌’ అనే పుస్తకావిష్కరణ...

Published : 25 Apr 2021 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌ మిథాలి రాజ్‌ పేర్కొన్నారు. ‘1971 ది బిగినింగ్‌ ఆఫ్‌ ఇండియా క్రికెటింగ్‌ గ్రేట్‌నెస్‌’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం (వర్చువల్‌ పద్ధతి)లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 21 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నానని, 2022లో న్యూజిలాండ్‌లో జరిగే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని స్పష్టం చేశారు.

‘20 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్‌ మొత్తం 2020 ఒక్క ఏడాదితో సమానంగా మారింది. ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని తెలుసు. అయినా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలి. అదెంత ముఖ్యమో తెలుసు. అందుకోసం నేను బాగా కష్టపడాలి. రోజురోజుకూ నా వయసు పైబడుతోంది. వన్డే ప్రపంచకప్‌ ముందు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలు ఉన్నాయి. అలాగే మధ్యలో వెస్టిండీస్‌తో హోమ్‌ సిరీస్‌ కూడా ఉంది. ఇవన్నీ తెలిసి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యం’ అని మిథాలి చెప్పుకొచ్చారు.

ఇకపై జరిగే ప్రతి సిరీస్‌ తనకెంతో ముఖ్యమని, అవి జట్టును బలంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోపడతాయని టీమ్‌ఇండియా కెప్టెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమకున్న అవకాశాలతోనే తన సహచర క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారని, వారిని అలా చూడటం సంతోషంగా ఉందని మిథాలి చెప్పారు. అలాగే తమ ఫాస్ట్‌ బౌలింగ్‌ యూనిట్‌పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విభాగంలో సీనియర్‌ ప్లేయర్‌ జూలన్‌ గోస్వామి కెరీర్‌ ముగింపు దశకు చేరుకున్నందున ఇతర బౌలర్లను ప్రపంచకప్‌కు సన్నద్ధం చేయాలన్నారు.

అనంతరం క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ మిథాలి జట్టుకు ఓ సూచన చేశారు. 2017 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ మహిళలు టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ను భయపెట్టారని, అలా కాకుండా మిథాలి సేన కూడా ప్రత్యర్థులకు తలవంచకుండా అంతే దీటుగా ఉండాలని చెప్పారు. పురుషుల క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ తన హావభావాలతో ప్రత్యర్థులతో ఎలా మెసులుకుంటాడో అలాగే తోటి ఆటగాళ్లు ఉంటారని సన్నీ వివరించారు. క్రికెట్‌లో ఆటగాళ్ల హావభావాలు ఎంతో ముఖ్యమని క్రికెట్‌ దిగ్గజం అభిప్రాయపడ్డారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు