T20 League : అప్పటి నుంచే హైదరాబాద్‌ ఆట గతి తప్పింది: మహమ్మద్‌ కైఫ్‌

 ప్రస్తుత టీ20 లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఓడిన హైదరాబాద్‌ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచి టాప్‌-4లోకి దూసుకొచ్చింది. అయితే ఇక్కడే మళ్లీ ...

Published : 15 May 2022 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఓడిన హైదరాబాద్‌ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచి టాప్‌-4లోకి దూసుకొచ్చింది. అయితే ఇక్కడే మళ్లీ హైదరాబాద్‌ బోల్తా పడింది. కీలకమైన సమయంలో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి 10 పాయింట్లతో ఏడో స్థానానికి పడిపోయింది. ఇక మిగిలిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకునే అవకాశం ఉంది. ఇవాళ కోల్‌కతాతో హైదరాబాద్‌ తలపడనుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ జట్టు ప్రదర్శనపై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్‌ విశ్లేషించాడు.

‘‘ఇప్పుడు ఉన్న హైదరాబాద్‌ టీమ్‌ బౌలింగ్‌పరంగా పటిష్ఠమైన జట్టేమీ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే గత మ్యాచుల్లో కీలకమైన జాన్‌సెన్‌ను తీసుకోలేదు. అతడికి బదులు కార్తిక్ త్యాగిని ఎంచుకుంది. ఇంకా కొత్త బౌలర్లను తీసుకుంటున్నప్పటికీ బలంగా కనిపించడం లేదు. ఐదు మ్యాచ్‌ల తర్వాత వరుసగా ఓడిన రెండు మ్యాచుల్లోనే నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు (భువి, నటరాజన్‌, ఉమ్రాన్‌, జాన్‌సెన్‌) ఉన్నారు. ఈ నలుగురే గత మ్యాచులను గెలిపించారు. అయితే ఇప్పుడు ఇందులో జాన్‌సెన్‌ లేడు. ఉమ్రాన్‌ పేస్‌ పెద్దగా ప్రభావం చూపించడం లేదు’’ అని కైఫ్ వివరించాడు. 

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్‌ సిక్సర్లు బాదడంతో హైదరాబాద్‌ బౌలర్లపై (జాన్‌సెన్‌పై) బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడానూ ఓ కారణంగా కనిపిస్తోందని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘గుజరాత్‌తో మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో బౌలర్లపై ముత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం కూడానూ హైదరాబాద్‌ జట్టు రిథమ్‌ కోల్పోవడానికి కారణంగా చెప్పాలి.  ముత్తయ్య ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండే వ్యక్తి. అయితే జాన్‌సెన్‌ పక్కన ఉన్నప్పుడే ముత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం సరైంది కాదు. ఆ విధంగా చేయడం వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లోని మంచి వాతావరణం దెబ్బతింటుంది. ఆ మ్యాచ్‌ ముందు వరకు జాన్‌సెన్‌ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఒక్క మ్యాచ్‌లో సరైన ప్రదర్శన చేయకపోతే పక్కకు తప్పించి కార్తిక్‌ త్యాగిని తీసుకొని రావడం సరైన నిర్ణయం కాదు’’ అని కైఫ్ పేర్కొన్నాడు. గుజరాత్‌పై ఓటమి తర్వాతనే వరుసగా హైదరాబాద్‌ మూడు పరాజయాలను నమోదు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని