Mohammad Kaif: అప్పుడే శిఖర్‌ ధావన్‌ అంటే ఏంటో తెలిసింది: కైఫ్‌

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు జరుగుతున్నాయి. దీంతో అన్నింట్లోనూ అన్ని దేశాల క్రికెటర్లు కలిసి ఆడుతున్నారు. అలాగే భారత టీ20 లీగ్‌లోనూ అనేక మంది విదేశీ స్టార్‌ ఆటగాళ్లు పాలుపంచుకుంటున్నారు...

Published : 12 Apr 2022 01:31 IST

స్టాయినిస్‌తో తన బలహీనతల్ని బయటపెట్టలేదు

(Photo: Mohammad Kaif Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు జరుగుతున్నాయి. దీంతో అన్నింట్లోనూ అన్ని దేశాల క్రికెటర్లు కలిసి ఆడుతున్నారు. అలాగే భారత టీ20 లీగ్‌లోనూ అనేక మంది విదేశీ స్టార్‌ ఆటగాళ్లు పాలుపంచుకుంటున్నారు. అయితే, చాలా మంది క్రికెటర్లు ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నా తమ బలహీనతల్ని విదేశీ ఆటగాళ్లతో పంచుకోరని దిల్లీ మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన ఈ టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఈ విషయంలో ఆటగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తారని కొనియాడాడు. అందుకు సంబంధించి ధావన్‌, స్టాయినిస్‌ల ఉదాహరణ వెల్లడించాడు.

‘గతేడాది దిల్లీ జట్టులో ఓ ప్రాక్టీస్‌ గేమ్‌ జరిగినప్పుడు స్టాయినిస్‌ బౌలింగ్‌ చేస్తుంటే ధావన్‌ క్రీజులో ఉన్నాడు. అప్పుడు నేను అంపైరింగ్‌ చేస్తున్నా. ఒక బంతికి ధావన్‌ సింగిల్‌ తీసి నాన్‌స్ట్రైకర్‌ వైపు రాగానే స్టాయినిస్‌ అతడి వద్దకు వెళ్లి.. ‘ఫీల్డింగ్‌లో మార్పులు చేయాలా’ అని అడిగాడు. ‘నీకెలాంటి ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్‌ కావాలో చెబితే.. అలా సెట్‌ చేస్తా’ అని చెప్పాడు. దానికి ధావన్‌ స్పందిస్తూ.. ‘పర్లేదు ఇప్పుడున్న ఫీల్డింగే ఉండనివ్వు’ అని బదులిచ్చాడు. దీంతో స్టాయినిస్‌ బౌలింగ్‌ కోసం పరుగు తీసేందుకు వెళ్లగా ధావన్‌ నావైపు తిరిగి.. ‘నా బలహీనతల గురించి తనతో ఎందుకు చెప్తా?’ తర్వాత యూఏఈలో జరిగే ప్రపంచకప్‌ ఆడాలి. నా బలహీనతల్ని అతడికి ఎందుకు చెప్పాలి?’ అని నాతో చెప్పాడు’ అని కైఫ్‌ వెల్లడించాడు.

అప్పుడే తనకు ఈ ఆటగాళ్లు ఎంత తెలివిగలవారో అర్థమైందని చెప్పాడు. ‘ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నా ఆటగాళ్లు తమ బలహీనతల్ని ఇతరులతో పంచుకోరని నాకు అప్పుడే అర్థమైంది. ఆరోజు ధావన్‌ కావాలనే తనకు ఎలాంటి ఫీల్డింగ్‌ కావాలో చెప్పలేదు. అలా తమ బలహీనతల్ని చెప్పుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌లో తమపై ఆధిపత్యం చెలాయిస్తారని ముందే పసిగట్టారు. కానీ.. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. వాళ్లిద్దరూ ఆటపరంగా అలా ఉన్నా మంచి స్నేహితులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందరూ ధావన్‌ చాలా స్నేహపూర్వకంగా ఉంటాడని అనుకుంటారు. కానీ, అవే కాకుండా అతడిలో ప్రణాళికలు, ఎక్కడ ఎలా ఉండాలనే తెలివితేటలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ అతడెలాంటి వాడో తెలియజేస్తాయి’ అని కైఫ్‌ వివరించాడు. కాగా, గతేడాది ఇద్దరూ దిల్లీ జట్టులో ఆడగా ఈసారి వేర్వేరు జట్లకు మారిపోయారు. ఈ సీజన్‌లో ధావన్‌ పంజాబ్‌ తరఫున, స్టాయినిస్‌ని లఖ్‌నవూ తరఫున ఆడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని