T20 World Cup: ఐసీయూలో రెండు రాత్రులుండి..

అనారోగ్యంతో బాధపడుతున్న ఆ క్రికెటర్‌.. రెండు రాత్రులు ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. ఎలాగైనా టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆడాలనే సంకల్పంతో వేగంగా కోలుకున్నాడు. మైదానంలో అడుగుపెట్టి జట్టు

Updated : 13 Nov 2021 08:50 IST

దుబాయ్‌: అనారోగ్యంతో బాధపడుతున్న ఆ క్రికెటర్‌.. రెండు రాత్రులు ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. ఎలాగైనా టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆడాలనే సంకల్పంతో వేగంగా కోలుకున్నాడు. మైదానంలో అడుగుపెట్టి జట్టు తరపున అత్యధిక పరుగులు (52 బంతుల్లో 67) చేసిన ఆటగాడిగా నిలిచాడు. చివరకు జట్టు ఓటమి పాలైన అతని పోరాట స్ఫూర్తి మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఆ ఆటగాడే.. పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌. అనారోగ్యం బారిన పడిన రిజ్వాన్‌ ఆసుపత్రిలో చేరాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అతను తీవ్రమైన ఛాతీనొప్పితో రెండు రాత్రులు ఐసీయూలో చికిత్స తీసుకున్నాడని గురువారం ఆస్ట్రేలియాతో సెమీస్‌ ముగిసిన తర్వాతే వెలుగులోకి వచ్చింది. పాక్‌ జట్టు వైద్యుడు నజీబ్‌ ఈ విషయాన్ని బయట పెట్టాడు. ‘‘ఆసుపత్రిలో చేరిన తర్వాత ఈ నెల 9న రిజ్వాన్‌కు తీవ్రమైన ఛాతీ అనారోగ్యం కలిగింది. దాని నుంచి కోలుకునేందుకు రెండు రాత్రులు ఐసీయూలో గడిపాడు. అద్భుతంగా కోలుకుని మ్యాచ్‌ ఆడేందుకు కావాల్సిన ఫిట్‌నెస్‌ సాధించాడు. గొప్ప సంకల్పం, దృఢత్వంతో దేశం కోసం ఆడాలనే అతని పోరాట స్ఫూర్తిని మనం చూశాం. మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేశాడో కూడా చూశాం. అతను ఐసీయూలో చేరాడనే విషయాన్ని జట్టు మేనేజ్‌మెంట్‌ ఆదేశాల మేరకు రహస్యంగా ఉంచాం. ఇది మొత్తం జట్టు నైతిక బలాన్ని దెబ్బతీయకూడదనే అలా చేశాం’’ అని నజీబ్‌ వెల్లడించాడు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా రిజ్వాన్‌ ఆసుపత్రిలో ఓ రాత్రి ఉన్నాడని, అతనో పోరాట యోధుడని సెమీస్‌కు ముందు పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌ హెడెన్‌ చెప్పాడు. మరోవైపు రిజ్వాన్‌ స్వచ్ఛందంగా సెమీస్‌లో ఆడేందుకు ముందుకు వచ్చాడని కెప్టెన్‌ బాబర్‌ పేర్కొన్నాడు. ‘‘నేను రిజ్వాన్‌ను చూసినప్పుడు ఇబ్బందిగా కనిపించాడు. కానీ తన ఆరోగ్యం గురించి అడిగినప్పుడు మాత్రం మ్యాచ్‌ ఆడతానని చెప్పాడు. కచ్చితంగా అతనో జట్టు మనిషి. అతను ఆడిన తీరు అసాధారణం’’ అని బాబర్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని