Gambhir: యువరాజ్‌కు తగిన గుర్తింపు దక్కలేదు: గంభీర్‌

టీమ్‌ఇండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌కు తగిన గుర్తింపు దక్కలేదని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) అభిప్రాయపడ్డాడు.

Updated : 17 Jun 2023 14:13 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌ (Yuvaraj Singh)కు తగిన గుర్తింపు దక్కలేదని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తి, అతని పీఆర్‌ టీమ్‌ (Public Relations Team) ఈ ప్రపంచకప్‌ల్లో అతనిని హీరోగా చేశారని వ్యాఖ్యానించాడు. కానీ, వాస్తవానికి ఈ రెండు టోర్నమెంట్‌లలో భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లింది యువరాజ్ సింగ్ అని గంభీర్‌ పేర్కొన్నాడు. 

‘‘అతడు (యువరాజ్) ఎప్పుడూ నేను ప్రపంచ కప్ గెలిచానని చెబుతాడు. కానీ.. 2011, 2007 టీ20 ప్రపంచ కప్‌లలో మమ్మల్ని ఫైనల్స్‌కు తీసుకెళ్లిన వ్యక్తి యువరాజ్ సింగ్ అని నేను నమ్ముతున్నా. అతను రెండు టోర్నమెంట్‌లలో మ్యాన్‌ ఆఫ్ ది టోర్నమెంట్ అని అనుకుంటున్నా. నాకు కచ్చితంగా తెలియదు. (యువరాజ్ 2011లో మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకోగా.. 2007 టీ20 ప్రపంచకప్‌లో షాహిద్ అఫ్రిది మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు). 2007, 2011 ప్రపంచ కప్‌ల గురించి మాట్లాడేటప్పుడు మనం యువరాజ్ పేరును ప్రస్తావించకపోవడం దురదృష్టకరం. మార్కెటింగ్, పీఆర్‌ టీమ్‌ ఒక వ్యక్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా వారిని తక్కువ చేసి చూపించారు. ఎవరూ తక్కువ కాదు.  ఇదంతా మార్కెటింగ్, పీఆర్‌ టీమ్‌ మాయ. మనకు ఎవరు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వరల్డ్ కప్‌లు సాధించి పెట్టారో చెబుతూ వస్తున్నారు. కానీ అది ఆ ఒక్కడి వల్ల సాధ్యమైనది కాదు. దాంట్లో మొత్తం టీమ్ కృషి ఉంది. ఏ ఒక్కరో అంత పెద్ద టోర్నీ గెలవలేరు. అలా జరిగితే భారత్‌కు ఇప్పటికే 5-10 వరల్డ్ కప్‌లు ఉండేవి’’ అని గంభీర్‌ అన్నాడు.  

భారత్‌లో జట్టు కంటే వ్యక్తి పూజ ఎక్కువని, అందుకే టీమ్‌ఇండియా చాలా కాలంగా ఐసీసీ ట్రోఫీలు గెలవట్లేదని గంభీర్‌ అన్నాడు. ‘‘చాలా మంది ఈ విషమం చెప్పరు. కానీ, ఇది నిజం. నేను దీన్ని చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది ప్రపంచం ముందుకు రావాలి. మన దేశంలో జట్టు కంటే ఆటగాళ్లనే ఎక్కువగా చూస్తారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో ఆటగాడి కంటే జట్టే గొప్పది. మన దేశంలో బ్రాడ్‌కాస్టర్‌, మీడియాతోపాటు అందరూ పీఆర్‌ ఏజెన్సీలా మారారు. మన దేశంలో వ్యక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తారు.. అందుకే చాలా కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవట్లేదు’’అని గంభీర్‌ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని