Rishabh Pant: వైట్‌బాల్‌ క్రికెట్‌లో నా గణాంకాలు మరీ చెత్తగా ఏమీ లేవు: పంత్

వరుసగా విఫలమవుతున్న రిషభ్‌ పంత్‌కు అవకాశాలు ఇవ్వడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్రంగా విమర్శల దాడి చేస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలోనూ రిషభ్‌ విఫలం కావడం సెలెక్షన్ కమిటీకి తలనొప్పిగా మారింది. మరోవైపు జట్టులోకి వచ్చేందుకు ఆశావహులు ఎక్కువైపోయారు.

Published : 30 Nov 2022 10:00 IST

ఇంటర్నెట్ డెస్క్: బయట నుంచి వస్తున్న విమర్శలంత దారుణంగా తన వైట్‌బాల్‌ (వన్డేలు, టీ20లు) క్రికెట్‌ గణాంకాలు లేవని టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్‌ పంత్ స్పష్టం చేశాడు. టెస్టుల్లో రాణిస్తూ.. వన్డేలు, టీ20ల్లో విఫలం కావడంపై మాజీల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కివీస్ పర్యటనలో ఉన్న రిషభ్‌ పంత్.. ఆ వ్యాఖ్యలపై స్పందించాడు. అలాగే టీ20 ఫార్మాట్‌లో ఓపెనింగ్‌ చేయడంపై ఆసక్తి చూపిస్తానని, వన్డేల్లో మాత్రం నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడేందుకు ఇష్టపడతానని వెల్లడించాడు. 

‘‘అవకాశం వస్తే టీ20ల్లో ఓపెనర్‌గా.. వన్డేల్లో 4 లేదా 5వ స్థానం.. ఇక టెస్టుల్లో నా ఫేవరేట్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఇష్టం. వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు గేమ్ ప్లాన్‌ మారిపోతూ ఉంటుంది. అదే సమయంలో జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. టీ20లతో పోలిస్తే వన్డేల్లో మరీ దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే నా బ్యాటింగ్‌ గణాంకాల గురించి చాలా మంది ఏవేవో అనుకుంటున్నారు. ఒకసారి నా వన్డేలు, టీ20ల్లో గణాంకాలను చూస్తే మీకే తెలుస్తుంది. మరీ బయట చెప్పేంత చెత్తగా మాత్రం లేవు’’ అని పంత్‌ తెలిపాడు. తాజాగా కివీస్‌తో మూడో వన్డేలోనూ పంత్ కేవలం 10 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. రిషభ్‌ పంత్ మొత్త 29 వన్డేల్లో 107.5 స్ట్రైక్‌రేట్‌తో 855 పరుగులు, 66 టీ20ల్లో 126.4 స్ట్రైక్‌రేట్‌తో 987 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని