IND vs NZ: కోహ్లి ఖాతాలో చెత్త రికార్డు.!

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ముంబయి వేదికగా న్యూజిలాండ్, భారత్‌ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో కోహ్లి (0) ఖాతా తెరవకుండానే ఎల్బీడబ్ల్యూగా..

Updated : 04 Dec 2021 08:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ముంబయి వేదికగా న్యూజిలాండ్, భారత్‌ జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో కోహ్లి (0) ఖాతా తెరవకుండానే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు. దీంతో స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచుల్లో 6 సార్లు డకౌటైన మొదటి భారతీయ కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి తర్వాత మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ కెప్టెన్‌గా ఐదు సార్లు ఔటై రెండో స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్‌, మహేంద్ర సింగ్‌ ధోని.. మూడు సార్లు టెస్టుల్లో డకౌటయ్యారు. మొత్తంగా దిగ్గజ బ్యాటర్లలో ఒకడైన కోహ్లి.. తన టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు 10 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరడం గమనార్హం.

అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కోహ్లి..

వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (0) అనూహ్య రీతిలో ఔటైన విషయం తెలిసిందే. తనను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించిన నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మేనన్‌తో ఏదో మాట్లాడుతూ వెళ్లిపోయాడు. మైదానం వీడుతూ కోహ్లీ బౌండరీ లైన్‌ను బ్యాట్‌తో కొడుతూ వెళ్లాడు. ఇదంతా టీవీలో ప్రసారమైంది. అజాజ్ పటేల్ వేసిన 30వ ఓవర్ చివరి బంతి.. కోహ్లి ప్యాడ్లను తాకినట్లుగా భావించి కివీస్‌ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్‌ ఔటిచ్చాడు. ఇక కోహ్లి రివ్యూకు వెళ్లగా.. అక్కడ బంతి.. బ్యాట్‌, ప్యాడ్‌కు ఒకేసారి తగిలేలా కనిపించింది. అయితే, మొదట బ్యాటును తాకిందా.? ప్యాడ్‌ను తాకిందా.? అనే విషయం తెలియకపోవడంతో థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ వివిధ కోణాల్లో పరిశీలించారు. అయినా స్పష్టత రాలేదు. చివరికి కోహ్లీని ఔట్‌గా ప్రకటించారు. ఈ క్రమంలోనే కోహ్లి నిరాశతో వెనుదిరిగాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని