IPL 2022 : మిగతా ఏడుగురు టాప్‌ ప్లేయర్లను దక్కించుకోవడమే లక్ష్యం: డీసీ

మరో రెండు రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం..

Published : 10 Feb 2022 14:57 IST

ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం జరగనుంది. ఇప్పటికే పది ఫ్రాంచైజీలు దీనికి సంబంధించిన కసరత్తులో తీరిక లేకుండా ఉన్నాయి. ఎవరిని కొనుగోలు చేయాలి..? ఎంతకు దక్కించుకోవాలనే లెక్కల్లో మునిగిపోయాయి. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మెగా వేలం నిర్వహించేందుకు ఐపీఎల్ వర్గాలు బెంగళూరులో ఏర్పాట్లు చేసేశాయి. ఈ క్రమంలో శనివారం జరిగే టాప్‌ ప్లేయర్ల వేలంలో కనీసం ఏడుగురిని దక్కించుకోవాలని దిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. జట్టులో సమతూకం తీసుకొచ్చే ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతామని దిల్లీ క్యాపిటల్స్ సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రె వెల్లడించారు.

‘‘కోచ్‌లుగా మేం ఎప్పుడూ జట్టును సమతూకంగా ఉండేలా చూసుకుంటాం. కీలకమైన ఆటగాళ్లు జట్టులోకి తీసుకోవాలని భావిస్తాం. ఇప్పటికే మేం నలుగురు టాప్‌ ప్లేయర్లు రిషభ్‌ పంత్, అక్షర్‌ పటేల్, పృథ్వీ షా, ఆన్రిచ్ నోర్జ్‌లను అట్టిపెట్టుకున్నాం. అందులోనే టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌, ఓ స్పిన్నర్ కమ్‌ ఆల్‌రౌండర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ ఉన్నారు. తుది జట్టులో పదకొండు మంది ఆటగాళ్లలో మరో ఏడుగురిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అందులోనూ జట్టు బ్యాలెన్సింగ్‌ చాలా ముఖ్యం. మా ముందున్న అసలు లక్ష్యం కూడా అదే. అయితే నిజాయితీగా చెప్పాలంటే సవాల్‌తో కూడుకున్నదే. వేలంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. కొన్ని ఫ్రాంచైజీలు ఎక్కువ సొమ్మును కలిగి ఉన్నాయి’’ అని ఆమ్రె వివరించారు. మెగా వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ రూ 47.5 కోట్లను ఖర్చు చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని