Ramiz Raja: అజామ్‌పై అభిమానుల ట్రోలింగ్‌.. విరాట్ సెంచరీని ఉదహరించిన రమీజ్‌ రజా

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లు జరిగేది కేవలం మెగా టోర్నీల్లోనే.. అయితే ఇరు జట్ల ఆటగాళ్లను ఒకరినొకరితో పోల్చడం మాత్రం ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది.

Published : 07 Oct 2022 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లు జరిగేది కేవలం మెగా టోర్నీల్లోనే.. అయితే ఇరు జట్ల ఆటగాళ్లను ఒకరినొకరితో పోల్చడం మాత్రం ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. మరో 17 రోజుల్లో పొట్టి ప్రపంచకప్‌లో మరోసారి టీమ్‌ఇండియా-పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. గత ఆసియా కప్‌లో రెండుసార్లు దాయాదుల పోరును వీక్షించే అవకాశం అభిమానులకు దక్కింది. అయితే చెరొక విజయంతో సమంగా నిలిచినా.. టీమ్‌ఇండియా మాత్రం సూపర్‌-4 దశలో ఇంటిముఖం పట్టింది. పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరుకొని లంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అయితే తుదిపోరులో పాకిస్థాన్‌ ఓడిపోవడంపై అప్పట్లో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 

పాక్‌ ఓడినప్పటికీ.. అప్పుడు కూడా భారత్‌పై పడి ఏడ్చిన పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా.. మరోసారి పాక్‌ అభిమానుల ప్రవర్తనను ఎలా ఉంటుందో చెప్పడానికి అఫ్గాన్‌పై విరాట్ కోహ్లీ చేసిన సెంచరీని ఉదాహరణగా పేర్కొన్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ శతకం చేయడం అదే తొలిసారి కావడంతో టీమ్‌ఇండియా అభిమానుల ఆనందం అవధులు దాటింది. తాజాగా పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ కూడా ఇంగ్లాండ్‌పై సెంచరీ చేసినా.. సరైన స్ట్రైక్‌రేట్‌ను కొనసాగించడం లేదని పాక్‌ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో రమీజ్‌ రజా కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘అఫ్గానిస్థాన్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. దీంతో ఆసియా కప్‌లో జరిగిన మొత్తం ఎపిసోడ్‌ను భారత అభిమానులు మరిచిపోయారు. అలా మనం (పాక్‌ అభిమానులు) చేశామా? గత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరుకొంది. ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది. అలాగే ఆసియా కప్‌లోనూ పాక్‌ ఫైనల్‌కు చేరింది. కానీ మనదికాని రోజున ఓటమి తప్పదు. లంక చేతిలో ఓడి రన్నర్‌గా నిలిచాం. అయినా సరే బాబర్‌ అజామ్‌ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల బాబర్ అజామ్‌ కూడా శతకం కొట్టాడు. కానీ స్ట్రైక్‌రేట్ 130కి తగ్గింది. అదే సమయంలో డేవిడ్ వార్నర్‌ స్ట్రైక్‌రేట్‌ (140) కూడా భారీగా లేదు. అందుకే ట్రోలింగ్‌ అంతా పనికిమాలిన అంశం’’ అని రమీజ్‌ రజా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని