Virat Kohli : అందుకేనేమో.. వారందరికీ విరాట్ కోహ్లీ మార్గదర్శకుడు!

 కుమార్తెను కోల్పోయిన కొద్ది రోజులకే బాధను దిగమింగుతూ..

Updated : 02 Mar 2022 07:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : కుమార్తెను కోల్పోయిన కొద్ది రోజులకే బాధను దిగమింగుతూ రంజీ ట్రోఫీలో బరోడా బ్యాటర్‌ విష్ణు సోలంకీ అద్భుత శతకం సాధించి అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు. రోజుల బిడ్డను పోగొట్టుకుని ఓపికగా క్రీజ్‌లో నిలబడి ఆడటమంటే మామూలు విషయం కాదు. చిన్న వయస్సులోనే రక్త సంబంధీకులు దూరమైతే ఆ బాధను వర్ణించడం ఎవరి తరమూ కాదు. అయితే ఇలాంటి కఠిన పరిస్థితులను టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ కూడా అనుభవించాడు. అందుకేనేమో భారత గెలుపు కోసం మైదానంలోకి దిగితే కోహ్లీ చిరుతలా చెలరేగుతాడు. ఇంతకీ ఏంటా ఆ సంఘటన అనేది కోహ్లీతోపాటు రంజీ మ్యాచ్‌ను ఆడిన పునిత్ బిస్త్‌, శ్రీవాత్స్ గోస్వామి గుర్తుకు తెచ్చుకున్నారు.. 

2006 డిసెంబర్‌ 18.. అప్పుడు విరాట్ కోహ్లీ దిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. ఇక ఆఖరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. మూడో రోజు బ్యాటింగ్‌కు దిగుదామని ఉత్సాహంగా ఉన్న కోహ్లీకి పిడుగులాంటి వార్త అందింది. అర్ధరాత్రి తండ్రి ప్రేమ్‌ బ్రెయిన్‌స్ట్రోక్‌తో ప్రాణాలు విడిచారని తెలిసింది. దీంతో ఒక్కసారిగా జట్టులోని సభ్యులు ఉన్న గదిలో నిశ్శబ్దం ఆవరించింది. 17 ఏళ్ల విరాట్ కోహ్లీ ఓ మూలన తీవ్ర మనోవేదనతో కూర్చొని ఉన్నాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడే పునిత్ బిస్త్‌ గదిలోకి అడుగు పెట్టడంతో అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యాడు. లోపల తుపానుతో పోరాడుతున్నాడని చెప్పడానికి కోహ్లీ ముఖం చూస్తే సరిపోతుందని అనిపించింది. మ్యాచ్‌ ముగింపు నాటికి కోహ్లీ, బిస్త్‌ నాటౌట్‌గా నిలిచారు. అయితే అప్పుడు కుటుంబపరంగా యువ విరాట్ జీవితం మాత్రం తలకిందులైంది.

జట్టు కష్టాల్లో ఉంటే ఏమాత్రం వెనుకడుగు వేయడు

మరో మూడు రోజుల్లో విరాట్ కోహ్లీ కెరీర్‌లో వందో టెస్టు ఆడబోతున్న నేపథ్యంలో 2006 రంజీ ట్రోఫీని బిస్త్‌ గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘‘నేను ఇవాళ్టికీ ఆశ్చర్యపోతున్నా. అంత కష్టంలోనూ విరాట్ కోహ్లీ ఎలా ధైర్యంగా ఉండగలిగాడు. అతని విషాదంలో మేమంతా షాక్‌కు గురయ్యాం. అయితే కోహ్లీ మాత్రం ఏమాత్రం సందేహించకుండా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధమయ్యాడు’’ అని బిస్త్‌ తెలిపాడు. ఇదంతా ఏదో నిన్నమొన్నే జరిగిందా అనిపిస్తోందని పేర్కొన్నాడు.  ‘‘అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే.. అప్పుడు మా జట్టు కష్టాల్లో ఉండటంతో దిల్లీ ఓ బ్యాటర్‌ను కోల్పోకూడదని  విరాట్ కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. అప్పటికీ కెప్టెన్‌ మిథున్ మన్‌హాస్‌, కోచ్ చేతన్‌ చౌహాన్‌ కూడా కోహ్లీకి చెప్పినా వినలేదు. వారే కాకుండా మా టీమ్‌లోని సభ్యులంతా ఇంటికి వెళ్లి కుటుంబంతో ఉండాలని సూచించాం. అయితే విరాట్ మాత్రం విభిన్నంగా జట్టు కోసం ఉండిపోయాడు’’ అని వివరించాడు. అప్పుడు అతడి వయస్సు 17.. ఇప్పుడు 33 ఏళ్లు అయితే ఆలోచనాపరంగా ఏమాత్రం మార్పు లేదని చెప్పాడు. ఫస్ట్‌స్లిప్‌లో ఉండే కోహ్లీ ఎంతో ఫన్నీగా ఉండేవాడని, ఇప్పటికీ తాము కలుస్తుంటామని బిస్త్‌ వెల్లడించాడు. ప్రస్తుతం బిస్త్‌ మేఘాలయ తరఫున ప్రొఫెషనల్‌ క్రికెట్ ఆడుతున్నాడు.

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది.  ఆ జట్టులో విరాట్‌తోపాటు శ్రీవాత్స్‌ గోస్వామి కూడా సభ్యుడే. దీంతో విరాట్ కోహ్లీతో తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘నేను బెంగాల్‌ నుంచి వచ్చా. విరాట్ దిల్లీ వాసి. మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు. ఆ సమయంలో మా శక్తి సామర్థ్యాలు అతడితో సరిపోయేవి కావు. అండర్ -19 రోజుల్లో కోహ్లీ నిస్సత్తువగా ఉన్న సమయమే లేదు. మా ఏజ్‌ గ్రూప్‌లో విరాట్ ఒక్కడే అంత ఉత్సాహంగా ఉండేది. విరాట్ టాలెంట్ అద్భుతం. సరైన సమయంలో చక్కని అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకోవడంలో ఏమాత్రం విఫలం కాలేదు’’ అని గోస్వామి చెప్పుకొచ్చాడు. కోహ్లీ నాయకత్వంలోని ఆర్‌బీసీ ఫ్రాంచైజీ తరఫున గోస్వామి ఐపీఎల్‌లో కొన్ని సీజన్‌లు ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని