MS Dhoni: సీఎస్‌కేను ధోనీ అలా పవర్‌హౌస్‌గా మార్చాడు: రవి శాస్త్రి

ఐపీఎల్‌లో ఫేవరేట్‌ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) తొలి స్థానంలో ఉంటుంది. అయితే, గతేడాది మాత్రం ప్రదర్శనలో నిరుత్సాహపరిచింది. ప్రస్తుత సీజన్‌లో తన మునుపటి ఫామ్‌ను కనబరుస్తూ పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది.

Updated : 10 May 2023 10:53 IST

(పాత చిత్రం: రవిశాస్త్రి ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో (IPL) చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. నాలుగుసార్లు ఛాంపియన్‌ సీఎస్‌కే ప్రదర్శన తీసికట్టుగా ఉండటంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, ప్రస్తుత సీజన్‌లో (IPL 2023) మాత్రం చెలరేగిపోతుందనే చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల ప్రకారం పాయింట్ల పట్టికలో టాప్‌-2లో కొనసాగుతోంది. నేడు దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తు దాదాపు ఖాయం కావడం తథ్యం. బౌలింగ్‌ విభాగంలో స్టార్లు లేకపోయినా.. యువ క్రికెటర్లతోనే అద్భుతమైన ఫలితాలను సాధించడం కేవలం ఎంఎస్ ధోనీ వల్లే సాధ్యమైందని టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో ధోనీ నాయకత్వంలో సీఎస్‌కే ఎదిగిన తీరుపై ఓ క్రీడా ఛానెల్‌లో రవిశాస్త్రి విశ్లేషించాడు. యువకులతో కూడిన బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌తోనే అద్భుతాలు సృష్టించడం అభినందనీయమని పేర్కొన్నాడు.

‘‘మ్యాచ్‌కు తగ్గట్టుగా కాంబినేషన్లను సృష్టించడంలో ఎంఎస్ ధోనీది మాస్టర్‌ మైండ్. గత సీజన్‌లో గొప్పగా రాణించలేకపోయిన ఆటగాడి నుంచి అద్భుతమైన ఆటతీరును రాబట్టడం ధోనీ ప్రత్యేకత. యువకుల్లో ఆత్మవిశ్వాసం కల్పించి అవకాశాలు ఇస్తూ ఫలితాలను సాధిస్తాడు. ఇందులో నేనేం ఆశ్చర్యపడటం లేదు. జట్టును బలోపేతం చేయడంలో ధోనీ స్పెషలిస్ట్‌. సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు దూసుకుపోతే మాత్రం మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే రెండు మ్యాచ్‌లు (ప్లేఆఫ్స్‌లో) చెన్నై వేదికగానే జరుగుతాయి. సొంతమైదానంలో భారీగా మద్దతు ఇచ్చే అభిమానుల మధ్య సీఎస్‌కేను అడ్డుకోవడం ప్రత్యర్థులకు అంత సులువేం కాదు. చెన్నై జట్టులో ఎవరైనా గాయాల కారణంగా దూరమైతే తప్ప.. ఆటగాళ్లంతా సరైన మార్గంలో ఉన్నారు’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

దిల్లీతో తొలిపోరు.. 

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌ 11 మ్యాచుల్లో ఆరు విజయాలు, నాలుగు ఓటములు, ఒక మ్యాచ్‌ రద్దు కావడం వల్ల 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి మూడు మ్యాచుల్లో కనీసం రెండు గెలిచినా ప్లేఆఫ్స్‌కు వెళ్లడం ఖాయం. సీఎస్‌కే మిగిలిన మూడు మ్యాచుల్లో దిల్లీతో రెండు సార్లు, కేకేఆర్‌తో ఒకసారి తలపడనుంది. అందులో భాగంగా నేడు చెపాక్‌ వేదికగా దిల్లీతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సీఎస్‌కే ఖాతాలో 15 పాయింట్లు లభిస్తాయి. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన దిల్లీని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ సీజన్‌లో వీరి మధ్య ఇదే తొలిపోరు కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని