Ravi Shastri: ఆ యువ ఆటగాళ్లతో అక్కడ చరిత్ర సృష్టించాం: రవిశాస్త్రి

గబ్బా టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. 

Published : 19 Jan 2023 18:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా గడ్డపై టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించి సరిగ్గా నేటికి రెండేళ్లు. జనవరి 19, 2021న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించి  2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో రిషభ్‌ పంత్‌ (89నాటౌట్‌; 138 బంతుల్లో 9x4, 1x6), వాషింగ్టన్‌ సుందర్‌(22) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ 5,  శార్దూల్ ఠాకూర్‌ వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. శుభ్‌మన్‌ గిల్ (91) అదరగొట్టారు. ఈ నేపథ్యంలో అప్పుడు భారత జట్టు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి గబ్బా టెస్టులో విజయం సాధించి రెండేళ్లు అవుతున్న సందర్భంగా ఆ మ్యాచ్‌లో రాణించిన ఆటగాళ్లను ప్రశంసించాడు. గిల్, సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్‌లు రాణించడం వల్లే ఆస్ట్రేలియా గడ్డపై భారత్ చరిత్ర సృష్టించిందన్నాడు.   

‘శుభ్‌మన్‌ గిల్ పునాది వేశాడు. మహమ్మద్ సిరాజ్ వికెట్లు తీశాడు. రిషబ్ పంత్ పూర్తి చేశాడు. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌ కూడా సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు’అని  రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు. దానికి గబ్బా టెస్టులో విజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు ట్రోఫీతో ఉన్న వీడియోని జత చేశాడు. ఫిబ్రవరి 9 నుంచి భారత్‌లో బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం బీసీసీఐ భారత జట్టుని ప్రకటించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని