Ravi Shastri: అది నవ్వుకోవాల్సిన విషయం కాదు.. చాలా సీరియస్‌: రవిశాస్త్రి

ఒకసారి ఒక ఆటగాడు తనను 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీసినట్లు టీమ్‌ఇండియా లెగ్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌తో భయంకరమైన సంఘటనను...

Published : 10 Apr 2022 01:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకసారి ఒక ఆటగాడు తనను 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీసినట్లు టీమ్‌ఇండియా లెగ్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌తో భయంకరమైన సంఘటనను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, అలా చేసిన క్రికెటర్‌ ఎవరో పేరు చెప్పాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అందులో టీమ్‌ఇండియా అభిమానులతో పాటు మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌, మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఉన్నారు. ఈ విషయంపై తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన శాస్త్రి కాస్త ఘాటుగా స్పందించాడు. అది నవ్వుకోవాల్సిన విషయం కాదని, ఆందోళన కలిగించే విషయమన్నాడు.

‘చాహల్‌ను అలా వేలాడదీసిన ఆటగాడు ఎవరో నాకు తెలియదు. ఏ ఆటగాడైనా తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే అది కచ్చితంగా క్షమించరాని విషయం. దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అది కొందరికి హాస్యాస్పదంగా అనిపించినా నాకు మాత్రం చాలా సీరియస్‌ మ్యాటర్‌. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటిని సహించరాదు. నేను ఇలాంటి విషయం వినడం ఇదే తొలిసారి. అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే ఆ ఆటగాడిని జీవితకాలం నిషేధించేవారు. అలాగే వీలైనంత త్వరగా అతడిని పునారావాస కేంద్రానికి తరలించి చికిత్స అందించేవారు. అయినా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులు వెంటనే తెలియజేయాలి. అలా మౌనంగా ఉండకూడదు’ అని శాస్త్రి పేర్కొన్నాడు.

చాహల్‌ తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. ‘‘నా కథ కొందరికి తెలుసు. దాని గురించి గతంలో ఎప్పుడూ మాట్లాడలేదు. ఎవరితోనూ పంచుకోలేదు. 2013లో ముంబయికి ఆడుతున్నప్పుడు బెంగళూరులో మ్యాచ్‌ పూర్తయ్యాక పార్టీ జరిగింది. ఒక ఆటగాడు బాగా తాగి కాసేపు నన్నే చూశాడు. అతని పేరు నేను ఇప్పుడు చెప్పదల్చుకోలేదు. తర్వాత తన దగ్గరికి రమ్మని పిలిస్తే వెళ్లాను. దీంతో నన్ను బాల్కనీలోకి తీసుకెళ్లి కిందకి వేలాడదీశాడు. అప్పుడు నేను రెండు చేతులతో అతడిని గట్టిగా పట్టుకున్నా. అది 15వ అంతస్తు. ఏమాత్రం పట్టు తప్పినా నా పనైపోయేది. వెంటనే అక్కడున్న వాళ్లంతా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొద్దిసేపు నేను స్పృహ కోల్పోయా. నాకు నీళ్లు ఇచ్చాక తేరుకున్నా. ఆ సంఘటనతో బయటకు వెళితే ఎంత బాధ్యతగా ఉండాలో అర్థమైంది. ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నా. చిన్న పొరపాటు జరిగినా కిందపడిపోయేవాడిని. ప్రాణాలతో బయటపడేవాడిని కాదు’’ అని చాహల్‌ గుర్తుచేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని