టీమ్‌ఇండియా ‘అన్న’

భారత్‌కు ఎందరో స్పిన్నర్లు దొరికారు. అందులో ఈతరం మేటి రవిచంద్రన్‌ అశ్విన్‌. వికెట్లు అవసరమైన ప్రతిసారీ బంతితో మెరిసే అతడు జట్టుకోసం బ్యాటుతోనూ విధ్వంసం సృష్టించగలడు. నడుం నొప్పి వేధిస్తున్నా.. కాళ్లు లాగేస్తున్నా.. ప్రత్యర్థి పరీక్షిస్తున్నా.. గంటలకొద్దీ బంతులు వేయగలడు.....

Published : 15 Feb 2021 18:17 IST

అశ్విన్‌కు ఆటంటే ప్రాణం.. జట్టు కోసమే పోరాటం

(Photos: BCCI)

భారత్‌కు ఎందరో స్పిన్నర్లు దొరికారు. అందులో ఈతరం మేటి రవిచంద్రన్‌ అశ్విన్‌. వికెట్లు అవసరమైన ప్రతిసారీ బంతితో మెరిసే అతడు జట్టుకోసం బ్యాటుతోనూ విధ్వంసం సృష్టించగలడు. నడుం నొప్పి వేధిస్తున్నా.. కాళ్లు లాగేస్తున్నా.. ప్రత్యర్థి పరీక్షిస్తున్నా.. గంటలకొద్దీ బంతులు వేయగలడు. వందల కొద్దీ బంతులు అడ్డుకోగలడు. శతకాలు చేయగలడు. ఆ సత్తా ఉంది కాబట్టే మణికట్టు మాంత్రికుల పోటీతో రెండేళ్లు ప్రాధాన్యం దక్కకపోయినా ఇప్పుడు టీమ్‌ఇండియాకు ‘అన్న’ అయ్యాడు.


ఆత్మీయ సంబోధన

సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే డ్రస్సింగ్‌ రూమ్‌ చేరుకుంటున్న యాష్‌కు సహచరులు, సహాయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అతడిని తమ హృదయాలకు హత్తుకున్నారు. కానీ, అందరిదృష్టినీ ఆకర్షించింది మాత్రం ‘‘అరె.. అశ్విన్‌ అన్నా’’ అన్న అజింక్య రహానె అన్న మాటలే. ఎందుకంటే అతడి ఆటతీరు ఇప్పుడలా ఉంది. జట్టులో సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అతడితో మంచి అనుబంధం ఉంది. కొత్త కుర్రాళ్లను అతడెంతో ప్రోత్సహిస్తాడు. విలువైన సలహాలిస్తాడు. అందుకే దక్షిణాదికి చెందిన అతడిని ‘అన్నా’ అని ఆత్మీయతతో సంబోధిస్తున్నారు.‌


తగ్గిన ప్రాధాన్యం

మూడేళ్ల క్రితం వరకు టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక సభ్యుడు. మణికట్టు స్పిన్నర్ల రాకతో అతడికి తొలుత పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రాధాన్యం తగ్గింది. ఆపై పూర్తిగా చోటే పోయింది. క్రమక్రమంగా సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తుది జట్టులో చోటు దక్కడం అనూహ్యంగా మారిపోయింది. 2018లో భారత్‌ 14 టెస్టులు ఆడితే యాష్‌కు పది మ్యాచుల్లో చోటు దక్కింది. ఇక 2019లో 8 ఆడితే ఐదింట్లో మాత్రమే ఆడాడు. ఒకానొక సమయంలో తనకు మంచి రికార్డులున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లోనూ తుది జట్టులోకి రాలేకపోయాడు. సునిల్‌ గావస్కర్‌ నుంచి మరెందరో మాజీ క్రికెటర్లు అతడిని పక్కన పెట్టడాన్ని ప్రశ్నించారు. అలాంటి స్థితి నుంచి అతడి ప్రతిష్ఠ మళ్లీ అత్యున్నత స్థితికి చేరుకుంది.


ఆసీస్‌ పర్యటనతో జోరు

ఆస్ట్రేలియా పర్యటన నుంచి అశ్విన్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అంతకుముందు అతడు బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేసి చాన్నాళ్లే అయింది. 2016, డిసెంబర్లో చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో చివరిసారిగా అర్ధశతకం సాధించాడు. అదే ఏడాది ఆగస్టులో గ్రాస్‌ఐస్‌లెట్‌లో శతకం బాదాడు. బంతితో వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగుల పరంగా జట్టుకు బాకీ పడ్డాడు. ఇదే అదనుగా అతడిలోని బ్యాటర్‌ మరుగున పడిపోతున్నాడని విమర్శలు మొదలయ్యాయి. వీటన్నింటినీ మనసులోనే పెట్టుకున్న యాష్‌ సిడ్నీ టెస్టులో తానెంత విలువైన ఆటగాడినో చాటిచెప్పాడు. ఐదోరోజు హనుమ విహారితో కలిసి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. నడుం నొప్పితో పడక మీద నుంచి లేవలేని స్థితిలో నొప్పి నివారణ సూదులు తీసుకొని 3 గంటలు క్రీజులో గడిపాడు. 128 బంతులు ఎదుర్కొని అజేయంగా 39 పరుగులు చేశాడు. మరోవైపు తనలాగే గాయంతో విలవిల్లాడుతున్న హనుమ విహారి (23*; 161 బంతుల్లో)కి అండగా నిలిచి ఓటమి నుంచి తప్పించాడు. ఇక చెన్నైలో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో అతడి బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అనూహ్యంగా.. అంచనాలకు అందకుండా తిరుగుతున్న బంతులను ఎదుర్కొంటూ కెరీర్‌లోనే అద్వితీయమైన శతకం చేసేశాడు. 148 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు.


ఆటంటే ప్రాణం

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో యాష్‌ రాణించేందుకు కారణం అతడి నేర్చుకొనే తత్వమే. టీమ్‌ఇండియాలో చోటు దక్కని పరిస్థితుల్లో అతడు తమిళనాడు జట్టుకు ఆడాడు. మణికట్టు స్పిన్నర్లకు దీటుగా వికెట్లు తీసేందుకు విపరీతంగా సాధన చేశాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన అతడు దేశవాళీ క్రికెట్లో లెగ్‌స్పిన్‌ను నేర్చుకున్నాడు. సంప్రదాయ స్పిన్నర్‌కు భిన్నంగా అతడి అమ్ముల పొదిలో ఎన్నో వైవిధ్యమైన బంతులు ఉంటాయి. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ మనసును చదవడంలో యాష్‌ ఆరితేరాడు. వారు ఎలా ఆలోచిస్తున్నారో ముందే పసిగట్టి బోల్తా కొట్టిస్తాడు. బ్యాటు, బంతికి కాకుండా అవతలి ఆటగాడి మైండ్‌తో పోటీపడటం అతడి శైలి. అందుకే అతడు తక్కువ టెస్టుల్లోనే 400 వికెట్లకు చేరువయ్యాడు. ఇక ఎడమతిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ అయితే చాలు.. ఆ వికెట్‌ తనదే అన్నంత ధీమాతో ఉంటాడు. 200 లెఫ్టార్మ్‌ బ్యాటర్ల వికెట్లు తీయడం ఇందుకు నిదర్శనం. ఇక కుర్రాళ్లకు అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటాడు. బౌలర్లకు సలహాలు ఇస్తుంటాడు. ఏ లైన్‌లో ఎలా బంతులు వేయాలో సూచిస్తాడు. ఆటంటే అశ్విన్‌కు ప్రాణం! అందుకే నడుం నొప్పి ఉన్నా కాలి నొప్పి ఉన్నా ఒంట్లో ఏదైనా అవయవం స్పందించకపోయినా అతడు ఇన్నింగ్స్‌కు 50+ ఓవర్లు వేస్తాడు. క్రికెట్‌పై ఈ భావోద్వేగమే అతడిని ‘అన్న’గా మార్చింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని