Rishabh Pant: పంత్‌ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్‌.. ప్లాస్టిక్‌ సర్జరీ చేసిన వైద్యులు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలైన రిషభ్ పంత్‌ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐతోపాటు దిల్లీ క్రికెట్‌ బోర్డు సునిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటూ అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీడీసీఏ వెల్లడించింది.

Updated : 31 Dec 2022 14:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రోడ్డు ప్రమాదానికి గురై దెహ్రాదూన్‌లో చికిత్స పొందుతున్న టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు చిన్నపాటి ప్లాస్టిక్‌ సర్జరీ జరిగినట్లు దిల్లీ క్రికెట్‌ అసోసియేషన్ డైరెక్టర్‌ శ్యామ్‌ తెలిపారు. ముఖం మీద అయిన గాయాలకు దెహ్రాదూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో ఈ సర్జరీ  చేసినట్లు పేర్కొన్నారు. తొలుత దిల్లీకి ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా తరలించాలని భావించినప్పటికీ.. మ్యాక్స్‌లోనే శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ మేరకు శ్యామ్‌ శర్మ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 

‘‘డీడీసీఏ నుంచి ఓ బృందం దెహ్రాదూన్‌లోని ఆసుపత్రికి వెళ్లి రిషభ్‌ పంత్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్లాస్టిక్‌ సర్జరీ అవసరం కావడంతో అక్కడే వైద్యులు పంత్‌కు నిర్వహించారు’’ అని శర్మ వెల్లడించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం నిర్వహించిన ఎక్స్‌రేల్లో పంత్‌ కుడి కాలు లిగ్మెంట్‌ స్థాన భ్రంశం కావడం, నుదురు భాగంలో చిట్లిన గాయాలు ఉన్నట్లు వైద్యులు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే మెదడు, వెన్నెముకకు సంబంధించిన ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఎలాంటి సమస్య లేదని, అంతా సాధారణంగా ఉన్నట్లు తాజాగా వైద్యులు ప్రకటించారు. ప్రమాదానికి సంబంధించి సోషల్‌ మీడియాలో వచ్చిన సీసీ కెమెరాల్లో ఫుటేజీ ప్రకారం.. పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టిన క్షణాల్లోనే మంటలు అంటుకొన్నట్లు తెలుస్తోంది. అయితే హైవేలో ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు వెంటనే పంత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

పంత్‌ను కాపాడిన వారిని సత్కరిస్తాం: డీజీపీ

జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన పంత్‌ను వెంటనే కాపాడి ఆసుపత్రికి తరలించిన స్థానికులను తప్పకుండా సత్కరిస్తామని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. రోడ్డు, రవాణా, హైవేస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘గుడ్‌ సమరితాన్’ పథకం కింద గౌరవిస్తామని తెలిపారు. ‘‘రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంట సమయం బాధితుడికి చాలా కీలకం. ఆ సమయంలో ట్రీట్‌మెంట్‌ అందిస్తే ప్రాణాలకు ప్రమాదం లేకుండా చూడొచ్చు. ఇలాంటి సామాజిక పరివర్తనను ప్రతి ఒక్కరిలో కల్పించడానికి ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగింది.  ఇలా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సహాయం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా’’ అని డీజీపీ పేర్కొన్నారు. 

ప్రధానికి ధన్యవాదాలు: బీసీసీఐ

పంత్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే అతడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. అలాగే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో ప్రధానికి బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. ‘పంత్ కుటుంబానికి భరోసా ఇస్తూ వారితో మాట్లాడిన ప్రధానికి కృతజ్ఞతులు’’ అంటూ రీట్వీట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని