ప్రతిసారీ ఈ చర్చేంటి?: హిట్‌మ్యాన్‌

భారత స్పిన్‌ పిచ్‌లపై ఇంగ్లాండ్‌ మాజీలు చేస్తున్న విమర్శలను టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్ శర్మ తీవ్రంగా ఖండించాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తాము ఎలాంటి....

Published : 21 Feb 2021 22:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత స్పిన్‌ పిచ్‌లపై ఇంగ్లాండ్‌ మాజీలు చేస్తున్న విమర్శలను టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్ శర్మ తీవ్రంగా ఖండించాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తాము ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదన్నాడు. కానీ తమ పిచ్‌లపై ఎందుకు ప్రతిసారీ చర్చ చేస్తున్నారని ప్రశ్నించాడు. ఇరు జట్లూ ఒకే పిచ్‌పై ఆడుతుంటాయని, ఎవరు గొప్పగా ఆడితే వారినే విజయం వరిస్తుందని రోహిత్‌ అన్నాడు. అయినా, సొంత మైదాన ప్రయోజనాలను ఏ జట్టు అయినా సద్వినియోగం చేసుకుంటుందని గుర్తుచేశాడు. పిచ్‌ల విషయంలో అభ్యంతరాలేమైనా ఉంటే, అన్ని ప్రాంతాల్లో పిచ్‌లు ఒకేలా సిద్ధం చేసేలా ఐసీసీని కోరాలన్నాడు.

పిచ్‌ల గురించి ఆలోచించకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా ఆడాలనే దానిపై దృష్టిసారించాలని హిట్‌మ్యాన్‌ సూచించాడు. పిచ్‌ల గురించి ఆలోచించినంత మాత్రాన పరిస్థితులేమి మారవన్నాడు. మొతెరా వికెట్‌ గురించి మాట్లాడుతూ.. రెండో టెస్టులో ఆడిన పిచ్‌ కంటే పెద్ద తేడాలేమీ ఉండవని తెలిపాడు. స్పిన్‌కు అనుకూలిస్తుందన్నాడు. చెపాక్‌ పిచ్‌పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మైకేల్ వాన్‌, మార్క్‌ వా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో రోహిత్‌ ఈ విధంగా స్పందించాడు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో బుధవారం నుంచి భారత్‌×ఇంగ్లాండ్ మూడో టెస్టు ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని