Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్‌ శర్మ

పని ఒత్తిడి, గాయాల కారణంగా టీమ్‌ ఇండియాకు ఈ ఏడాది ఆరేడుగురు కెప్టెన్సీ బాధ్యతలు వహించాల్సి వచ్చింది.

Published : 08 Aug 2022 02:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : పని ఒత్తిడి, గాయాల కారణంగా టీమ్‌ ఇండియాకు ఈ ఏడాది ఆరేడుగురు కెప్టెన్సీ బాధ్యతలు వహించాల్సి వచ్చింది. ఇలా ఎక్కువ మంది సారథులు లభించడంపై రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. జట్టులో చాలా మంది నాయకులు ఉండటం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, శిఖర్‌ ధావన్‌లాంటి వారు వైట్‌ బాల్‌ ఫార్మాట్‌లో భారత్‌ను నడిపించిన విషయం తెలిసిందే. జింబాబ్వేతో ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ధావన్‌ మరోసారి సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు.

‘అలాంటి నాయకత్వం జట్టు కలిగి ఉండటం చాలా ముఖ్యమని నేను భావిస్తాను. మేం భారత టీ20 లీగ్‌ ఆడతాం. ఇది పది జట్ల టోర్నమెంట్‌. 10 మంది కెప్టెన్లు ఉంటారు. వారు ఏదో ఒక దశలో భారత జట్టులో కూడా భాగమవుతారు ’ అని రోహిత్‌ శర్మ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ అన్నాడు.

‘మా వద్ద ఇలా ఎక్కువ మంది కెప్టెన్లు ఉండటం అద్భుతం. నిజాయతీగా చెప్పాలంటే.. ఈ కుర్రాళ్లు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుంటుండంతో.. నా పని కూడా కాస్త తగ్గుతుంది. జట్టులో చాలా మంది సారథులను తయారుచేయడం.. ఎల్లప్పుడూ మంచి సంకేతమే. వారు జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు.. ఆటను అర్థం చేసుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి’ అని రోహిత్‌ వివరించాడు.

కెప్టెన్‌, కోచ్‌ల నుంచి సందేశం స్పష్టంగా ఉంటే.. ఆటగాళ్లు కూడా అలా చేయడానికి కచ్చితంగా ప్రయత్నిస్తారని రోహిత్‌ అన్నాడు. అలా జరగాలంటే వాళ్లకి స్వేచ్ఛ అవసరమని.. అందుకే వారికి వీలైనంత స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.

ఈ ఏడాదిలో టీమ్ ఇండియాకు ఇప్పటి వరకూ ఏడుగురు కెప్టెన్సీ బాధ్యతలు వహించారు. విరాట్‌ కోహ్లీ అనంతరం రోహిత్‌ శర్మ మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా మారగా.. అతడు లేని సందర్భంలో కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, బుమ్రా, శిఖర్‌ ధావన్‌ జట్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని